"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Saturday, July 02, 2005

తిరువాసగం.. మహాద్భుతం

ఇళయరాజా ప్రతిభకు ప్రముఖుల ప్రశంసలు
(న్యూస్‌టుడే, చెన్నై)దాదాపు 30 నెలల సంగీత యాత్ర అది. భారతీయ సినీ సంగీత మేస్ట్రో ఇళయరాజా.. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరువణ్ణామలైలో ప్రదక్షిణలు చేస్తుండగా 'తిరువాసగం' సింఫనీ చేయాలన్న ఆలోచన వచ్చింది. అది ఎన్నోరకాల అవాంతరాలు ఎదుర్కొని ప్రస్తుతం 'ఆరటోరియా'(పలు సంగీత వాయిద్యాలు, గాయకులను భక్తిగీతాల కోసం సమన్వయపరిచే ఓ ప్రక్రియ)గా మనముందుకు వచ్చింది. ఈ తిరువాసగం విని 'ప్రపంచ సంగీతంలో ఇటువంటి ప్రయత్నం ఇంతవరకు జరగలేద'ని వ్యాఖ్యానించారట ఆస్కార్‌ అవార్డు అందుకున్న అమెరికన్‌ గేయ రచయితస్టీఫెన్‌ స్వార్జ్‌. అంతటి మహత్తర సంగీతం శుక్రవారం నగరంలో వేలాది మంది సంగీత ప్రియుల నడుమ లాంఛనంగా ఆవిష్కృతమైంది. ఇళయరాజా సంప్రదాయ సంగీత సాంస్కృతిక ట్రస్ట్‌ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. భారతదేశ సంప్రదాయేతర సంగీత చరిత్రలో ఈ కార్యక్రమం కొన్ని మధుర క్షణాలను నమోదు చేసిందంటే అది అతిశయోక్తి కాదు. సంగీతం, రాజకీయం, పాత్రికేయ రంగాలలో ఉన్నత శిఖరాలు అందుకున్న ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని మేస్ట్రో ఇళయరాజాపై తమ అభిమానం చాటుకున్నారు. 30 ఏళ్లుగా తన మధుర సంగీతంతో సినీ ప్రపంచాన్ని లాలించి, పాలిస్తున్న ఇళయరాజాను అభినందనల వర్షంలో ముంచెత్తారు.

అత్యున్నత యాత్రకు ఇది శ్రీకారం
కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి
భారతీయ, పాశ్చాత్య సంగీతాలను సమ్మిళితం చేయడం అంత సులభం కాదు. ఇళయరాజా తన విశిష్ట స్వరకల్పనా సామర్థ్యంతో బీతోవెన్‌, త్యాగయ్య చేతులు కలిపి చెట్టపట్టాలు ఆడేలా చేశారు! ఓ సమున్నత సంగీత యాత్రకు ఇది ఇళయరాజా వేసిన తొలి అడుగని భావిస్తున్నాను. ఇది భారతీయులందరికీ గర్వకారణం. అట్టడుగు స్థాయి నుంచి జీవితంలో ఇంతటి ఉన్నత శిఖరం చేరుకున్న ఇళయరాజా విజయయాత్ర అబ్రహాం లింకన్‌ జీవితాన్ని తలపిస్తోంది. ఆయన సంప్రదాయ సంగీత మాధుర్యాన్ని పూర్తిగా వినియోగించు కోవడమే కాదు.. దాని పరిధినీ విస్తరిస్తున్నారు. భవిష్యత్తులో ఇళయరాజా అందుకునే శిఖరాలకు.. ఏ సరిహద్దులూ ఉండబోవు.

అది సంగీతామృత సముద్రం
షెవాలియర్‌ బాలమురళీ కృష్ణ
ఈ ఆరటోరియా వింటుంటే సాక్షాత్తు ఆ శివుడే నా కళ్ళముందు సాక్షాత్కరించినట్టు అనిపించింది! కొత్తదనం, మాధుర్యాలు కలగలిసిన సంగీతామృత సాగరమది. ముఖ్యంగా 'వాయిద్యగోష్టి'ని ఉపయోగించడంలో ఆయనకు ఆయనే సాటని చెప్పాలి. ఆ సంగీతం వింటేమనస్సు దూదిపింజలా మారిపోతోంది.

సరిహద్దులు దాటిన సంగీతం
ఎన్‌. రామ్‌, 'ది హిందూ' ప్రధాన సంపాదకుడు
ఇళయరాజా తిరువాసగం రాష్ట్రం, దేశం, సంస్కృతి...ఇలా అన్ని సరిహద్దులనూ దాటే సంగీతమని చెప్పాలి. ప్రపంచ సంగీతంలో భారతీయ సంగీతమూ ఓ విడదీయలేని భాగమని ఈ సంగీతం చాటుతోంది. భారతదేశ నాగరికత ఔన్నత్యానికి ఇది మరో చిహ్నం. ఇటువంటి ఉన్నత సంగీతాన్ని ఎంపీ-త్రీ, ఇంటర్నెట్‌ డౌన్‌లోడింగ్‌ వంటి చౌకబారు ప్రక్రియలతో వినకపోతే మంచిది. ఓ గొప్ప ప్రయత్నానికి మనం ఆ మాత్రం గౌరవం ఇవ్వాలి.

మావాడు మహాగట్టివాడు
భారతీరాజా, ప్రముఖ దర్శకుడు
వాడూ (ఇళయరాజాను ఆయన ఇలాగే సంబోధిస్తారు), నేనూ మా పల్లెటూళ్లో తిరిగిన తిరుగుళ్లు గుర్తుకొస్తున్నాయి. అవన్ని చెబితే కన్నీళ్లు వచ్చేస్తాయి నాకు. చవిటి పర్రలతో నాగజెముడు మొక్కలు పూచే మా భూమి(మదురై జిల్లా) ఈ ప్రపంచానికి అందించిన ఓ చల్లటి సంగీత వృక్షమే ఇళయరాజా. మావాడు మహా గట్టివాడు.

ఇందుకోసమే ఎదురుచూశాం
కమల్‌హాసన్‌
ఇళయరాజా నుంచి ఈ 'తిరువాసగం' చాలా ఆలశ్యంగా వచ్చిందని చెప్పాలి. నాకు తెలిసినంత వరకు దాదాపు 30 ఏళ్ల కిందటే ఇళయరాజాలో ఇప్పటి ఈ తిరువాసగం చేసే సత్తా కనిపించింది. మేమంతా ఇటువంటి ప్రయత్నాన్ని ఎంతో కాలంగా ఎదురుచూశాం. భవిష్యత్తులో ఇంకా ఇటువంటి గొప్ప ప్రయత్నాలు జరగాలని ఆశిస్తున్నాను.

ఆయన శాంతి సాధకుడు
సూపర్‌స్టార్‌ రజినీ కాంత్‌
ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. దుఃఖం, ఆనందం ఇవేవీ మనతో ఎక్కువ కాలం ఉండవు. కానీ.. మానసిక ప్రశాంతత ఒక్కసారి సాధించామంటే అది మనతోనే ఉండిపోతుంది. దాన్ని సాధించడమే కష్టం. స్వామి (ఇళయరాజాను రజినీ అలాగే పిలుస్తారు) దాని సాధనలోనే ఉన్నారు. నేను ఆయన మార్గాన్ని అనుసరిస్తున్నాను. ఈ శాంతి ఉపాసనలో ఆయన వశిష్టుడైతే.. నేను విశ్వామిత్రున్ని అని చెప్పుకోవచ్చు. మా స్నేహం మా వృత్తికి అతీతమైంది.

శబ్ద తరంగాలు ఉన్నంత వరకు... : వైగో
మొత్తం 51 గీతాలున్న 'తిరువాసగం'లో కేవలం ఆరుపాటలు ఎంపిక చేసేందుకు ఇళయరాజా చూపిన ఔచిత్యం అబ్బురపరుస్తుంది. ఈ ప్రపంచంలో తమిళభాష, నాద తరంగాలు ఉన్నంత వరకు ఇళయరాజా సంగీతం ఉంటుంది. నేను తిరువాసగం 'ఆరటోరియా' గురించి పార్లమెంటులో కూడా మాట్లాడాను. ఎందువల్ల? ఆసియాలో ఇటువంటి ప్రయత్నం మరెక్కడా జరగలేదు కాబట్టి!.. ఈ రాష్ట్రంలో పుట్టిన మన ఇళయరాజా చేశారు కాబట్టి.

అంతా దైవనిర్ణయం
ఇళయరాజా
నాలుగేళ్ల కిందట నాలో ఓ చిన్న విత్తనంగా పుట్టిన తిరువాసగం ఆరటోరియా ఇలా ఓ ఫలవృక్షంగా మారడం వెనుక ఉన్నది కేవలం దైవనిర్ణయం మాత్రమే. నేను, దీని నిర్మాతలు అందరం నిమిత్త మాత్రులం. నిజానికి నేనెప్పుడూ కష్టం వచ్చినందుకు బాధపడ్డవాణ్ని కాదు. ఈ చెన్నై వీధుల్లో ఒక్కొక్కప్పుడు మూడురోజులపాటు భోజనం లేక తిరిగిన రోజులున్నాయి. అప్పుడూ ఆనందంగానే గడిచింది. నాతో సంగీతం ఉంది కాబట్టి! ఈ 'తిరువాసగం' చేసే క్రమంలో నేను చాలా బాధలు ఎదుర్కొన్నాను. ఆ గాయాలు ఇప్పుడిప్పుడే మాయమవుతున్నాయి.


Courtesy: ఈనాడు


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


0 Comments:

Post a Comment

Links to this post:

Create a Link

<< Home