"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Saturday, November 04, 2006

వికీ...అన్నింటి'కీ'


'యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్‌క్వచిత్‌'భారతంలోని ఈ వాక్యానికి అర్థం ఇది... 'ఇందులో ఉన్న విశేషాలే ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయి. ఇందులో లేనివి మరెక్కడా లేవు'... దీన్ని సమాచార సంపదతో తులతూగుతున్న వికీపీడియాకు అన్వయిస్తే అతిశయోక్తి కాబోదేవో! భూగోళం, చరిత్ర, గణితం, సాహిత్యం, రాజకీయం, ఆర్థికశాస్త్రం... ఎన్నెన్ని విభాగాలు! పేదరికం, స్థూలకాయం, గాంధీ, గాడ్సే, పల్లెటూరు, మెట్రోసెక్సువల్‌... ఎన్నెన్ని వైరుధ్యాలు! అన్నీ ఒకే చోట, కాణీ ఖర్చులేకుండా, ప్రతి ప్రశ్నకూ జవాబు దొరికే మార్గం ఉందా అంటే... ఉందని యావత్‌ ప్రపంచం ముక్తకంఠంతో ఉచ్చరిస్తున్న పేరు వికీపీడియా. ఇది అచ్చమైన సమాచార నిధి. యూజర్ల కొరకు యూజర్ల చేత నడుస్తున్న పోర్టల్‌. ప్రస్తుత వార్తలు కోరినా, అప్రస్తుత అంశాలు అడిగినా లేదనకుండా 'సెర్చ్‌' చేసుకొమ్మనే వెబ్‌సైట్‌. జ్ఞానతృష్ణ తీర్చే ఒయాసిస్‌. బరువుగా చెప్పాలంటే ఇదో స్వేచ్ఛా సమాచార ఉద్యమం.


నికలాయ్‌ గొగోల్‌ ఎలా చనిపోయాడు? ఇంతకీ ఎవరాయన?
'ను' జాతి ప్రజలు ఎక్కడుంటారు? ఏమిటి వారి ప్రత్యేకత?
చరిత్రలో జులై 12 ప్రాధాన్యం ఏమిటి? అసలీ క్యాలెండర్‌ ఎలా ప్రారంభమైంది?
'హోలోకాస్ట్‌' ఎందరిని బలిగొంది? హిట్లర్‌ ఎలాంటివాడు?
స్వస్తిక్‌ గుర్తు ఏయే దేశాల్లో వాడతారు? దేనికి సూచిక అది?
అల్జీమర్స్‌ రావడానికి కారణాలేమిటి? ఆ పేరెలా వచ్చింది?
'పర్చేజింగ్‌ పవర్‌ పారిటీ' అంటే ఏమిటి? ఎక్స్‌ఛేంజ్‌ రేటుతో దానికేంటి సంబంధం?
'గాడ్‌ఫాదర్‌ 2'లో హీరో ఎవరు? సీక్వెల్‌కూ ప్రీక్వెల్‌కూ తేడా ఏమిటి?
అన్నీ ప్రశ్నలే. సమాధానాలెక్కడ?
గొగోల్‌ రష్యన్‌ రచయిత అని తెలిసినవారికి, చైనాలోని 'ను' జాతి గురించి తెలియకపోవచ్చు. నటుడిగా అల్‌ పసీనో గొప్పతనం ఎరిగినవారు ప్రీక్వెల్‌ అనే మాటే విని ఉండకపోవచ్చు. 'అదేంకాదు, ఇవన్నీ మాకు తెలుసు' అని ఎవరైనా అన్నారంటే, వాళ్ళు కచ్చితంగా వాకింగ్‌ ఎన్‌సైక్లోపీడియా అయ్యుండాలి. అంత స్థాయిలేని మనలాంటి మామూలు మనుషులంతా ఆన్‌లైన్‌ ఎన్‌సైక్లోపీడియా వికీపీడియాను ఆశ్రయించాల్సిందే.

అరకోటి అంశాలు
వ్యక్తి, దేశం, వివాదం, సినిమా... ఏ సంబంధమూ లేని వివిధ అంశాలన్నింటికీ సంబంధించిన సమస్త సమాచారాన్ని ఒక్క చోట కూర్చడం సాధ్యమేనా? ఈ ఆలోచనే వికీపీడియాకు నాంది. అడిగింది ఏదైనా లేదనకుండా ఇస్తుంది కాబట్టే ఇది అగ్రగామి వెబ్‌సైట్‌గా కొనసాగుతోంది. ప్రారంభమైన ఆరేళ్లకే అత్యధికులు దర్శించే ఇరవై సైట్లలో ఒకటిగా www.wikipedia.org సంచలనం సృష్టించింది.

తొలుత ఇంగ్లిష్‌లో ప్రారంభమైన ఈ సైట్‌ జర్మన్‌, ఫ్రెంచ్‌, రష్యన్‌, ఇటాలియన్‌, స్పానిష్‌ భాషల్లోకి విస్తరించి, హీబ్రూ, అరబిక్‌ దాటి, తెలుగు, హిందీ దాకా విస్తరించింది. ప్రస్తుతం 250 భాషల్లో వికీపీడియా అందుబాటులో ఉంది. అన్నింట్లో కలిపి అరవై లక్షల వ్యాసాలు ఉన్నట్టు అంచనా. ఇందులో పదహారు భాషల్లో యాభైవేలకు పైగా వ్యాసాలున్నాయి. పద్నాలుగు లక్షల ఆర్టికల్స్‌తో ఇంగ్లిష్‌ (www.en.wikipedia.org) ప్రథమస్థానంలో ఉంది. ప్రతీ వ్యాసం చివరన వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌నూ ఇతర పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వ్యాసాలనూ లింక్‌ చేస్తారు. దీంతో అదనపు సమాచారం పొందే వీలుంటుంది. ఏ రకంగా చూసినా ఇది విజ్ఞాన భాండాగారమే. అందుకే సెకనుకు రెండువేల పేజీల రిక్వెస్టులు వస్తున్నాయి మరి. 'ఓ ప్రపంచాన్ని ఊహించండి... మానవజాతికి సంబంధించిన ప్రతి సమాచారం భూమ్మీది ప్రతి వ్యక్తికీ ఉచితంగా అందుబాటులో ఉండే సమాజం... మేము దాన్నే నిజం చేస్తున్నాం' అంటారు వికీపీడియా వ్యవస్థాపకుడు జిమ్మీ వేల్స్‌.

2001, జనవరి 15 నుంచి సేవలందిస్తున్న వికీపీడియా ప్రధాన సర్వర్‌ అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంది. అదనపు సర్వర్లు అమ్‌స్టర్‌డామ్‌(నెదర్లాండ్స్‌), సియోల్‌(దక్షిణకొరియా) నగరాల్లో ఉంచారు. పెరుగుతున్న ట్రాఫిక్‌ దృష్ట్యా మరో వంద సర్వర్లు వీటికి సపోర్టు చేస్తున్నాయి. 'మీడియావికీ' అనే సొంత సాఫ్ట్‌వేర్‌ను వికీపీడియాలో వినియోగిస్తున్నారు. రోజుకు కోటిన్నరమంది ఈ వెబ్‌సైట్‌ను దర్శిస్తున్నారని ఓ చిత్తులెక్క.

ఎడిటర్‌ మీరే
ఇంత తక్కువ కాలంలో ఇంత జనాదరణకు కారణం... చిన్న చిట్కా. ఇందులో ఎవరైనా కొత్త వ్యాసం రాయెుచ్చు, ఇదివరకే ఉన్నదానికి కొనసాగింపు నివ్వొచ్చు, అదనపు సమాచారం జతచేయెుచ్చు, ఉన్నదానికే మార్పులు చేయెుచ్చు. ఎప్పటికప్పుడు స్వచ్ఛందంగా అప్‌డేట్‌ చేసే అవకాశం యూజర్లకే ఇవ్వడం వల్ల తొలిఏడాదిలోనే పద్దెనిమిది భాషల్లో ఇరవై వేల వ్యాసాలు కూర్చడం జరిగింది. రెండో ఏడాదికల్లా వికీపీడియా 26 భాషలకు విస్తరించింది. మూడో సంవత్సరంలో 46 భాషలకూ నాలుగో ఏడు 161 భాషలవారికీ చేరువైంది. ఐదో ఏడుకు రెండొందలను దాటేసింది. అందుకే దీన్ని సమాచార రంగంలో పరిణామ సిద్ధాంతంగా పేర్కొంటున్నారు.

'ఎడిట్‌' చేయాలనుకునేవారు తమ పేరు ఆన్‌లైన్‌లో నవోదు చేసుకుంటే సరిపోతుంది. అది ఉచితమే. ఈ స్వచ్ఛంద ఎడిటర్లకు వికీపీడియా కొన్ని మార్గనిర్దేశకాలు పేర్కొంటోంది. వ్యాసం తటస్థ వైఖరితో ఉండాలనేది ముఖ్యాంశం. అందులోని అన్ని కోణాలనూ ఆవిష్కరించాలనేది రెండోది. వ్యక్తుల గురించి వ్యాసం రాసేప్పుడు వాళ్ల గొప్పతనంతో పాటు వారిమీద ఉన్న ఆరోపణలు జతచేయెుచ్చు. కాశ్మీర్‌ సమస్యను చర్చించాలనుకుంటే, పాకిస్థాన్‌, భారత్‌ రెండింటి వైఖరి ఏంటో చెప్పాలి.

వెబ్‌సైట్‌ను మామూలుగా చూసేవాళ్లను మినహాయిస్తే రిజిస్టర్‌ చేసుకున్నవాళ్లు ఇరవై లక్షలకు పైనే. ఇందులో 27,000 మంది నెలకు కనీసం ఐదు ఎడిట్స్‌ చేస్తున్నారు. నెలకు కనీసం వంద ఎడిట్స్‌ చేస్తున్నవారు నాలుగువేల మంది. విషయ పరిజ్ఞానం ఉండడంతోపాటు, ఇతరులకు తెలియజెప్పాలన్న ఉత్సాహం వీరిని 'ఈ-సేవ'కు పురిగొల్పుతోంది. ఇతర భాషలతో పోల్చితే తెలుగు సైట్‌(www.te.wikipedia.org)లో సమాచారం తక్కువే. జతచేయడానికి మనకు చాలా అవకాశం ఉంది. పూతరేకుల నుంచి పుట్టపర్తి దాకా, వైజాగ్‌ బీచ్‌ నుంచి వరంగల్‌ జిల్లా దాకా, రాజరాజనరేంద్రుడి చరిత్ర నుంచి రాజశేఖరరెడ్డి ప్రస్థానం దాకా కాదేదీ వ్యాసానికి అనర్హం.

నిజమెంత?
పాఠశాల విద్యార్థుల నుంచి విశ్వవిద్యాలయాల ఆచార్యుల దాకా ప్రతి ఒక్కరూ సమాచారం కోసం వికీపీడియామీద ఆధారపడుతున్నారు. సమావేశాల్లో ఇందులోని అంశాలను ఉటంకిస్తున్నారు. నివేదికలకు ఇది కొన్నిసార్లు మూలమవుతోంది. న్యాయవాదులు, వైద్యులు, ఇంజినీర్లు, జర్నలిస్టులు... అంతెందుకు, తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్న ప్రతివారూ క్లిక్‌ చేస్తున్నది వికీపీడియానే. అయితే ఈ సమాచారంలో సత్యమెంత? 'వికీపీడియన్స్‌' ఆకతాయి కుర్రాళ్లు అయితే? అసలు ఇలా చొరబడి గుప్పించేవారికి ఉన్న విద్యార్హతలేమిటి? దీనిమీదే భిన్నగళాలు వినిపించాయి. వాదనలూ ప్రతివాదనలూ జరిగాయి. రాసిన కొన్ని రోజులకే తమ వ్యాసాలు పూర్తిగా రూపు మారిపోయి ఉన్నాయని గగ్గోలుపెట్టిన ప్రొఫెసర్లు ఉన్నారు. తమ జీవితచరిత్రలో తప్పులు దొర్లాయని చిన్నబుచ్చుకున్నవారున్నారు. ఒక విషయం తెలియకపోవడం వేరు, తప్పుల తడకగా తెలియడం వేరు. రెండోది ప్రమాదకరమైంది. అది చదువరిని తప్పుదోవ పట్టిస్తుంది. అందుకే వికీపీడియాలోని ఇంత 'ఓపెన్‌నెస్‌' మంచిది కాదనే సూచనలు వచ్చాయి.

దీనికి వ్యవస్థాపకుడు జిమ్మీ వేల్స్‌ ఇలా స్పందిస్తారు. 'హైస్కూలు పిల్లవాడా... హార్వర్డ్‌ ప్రొఫెసరా... అన్నది కాదు ప్రశ్న. విషయంమీద పూర్తి అవగాహన ఉందా లేదా అన్నదే ముఖ్యం'. ఇక్కడో సంగతి గుర్తుంచుకోవాలి. వికీపీడియా సొంతంగా అధ్యయనాలు చేయదు. ఉన్న వాస్తవాన్ని అందజేయాలన్నదే దాని సంకల్పం. అయితే నమ్మదగిన సోర్సుల నుంచి విషయం గ్రహిస్తే కచ్చితత్వానికి ఢోకా ఉండదు. అప్పుడే సరైన సమాచారం అందరికీ అందుబాటులో ఉంచగలమని చెబుతారు జిమ్మీ.

సమాచార సముద్రం
గత సంవత్సరం 'నేచర్‌' పత్రిక ఓ అధ్యయనం చేసింది. సుప్రసిద్ధమైన ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికాతో వికీపీడియాను పోల్చిచూసింది. కచ్చితత్వం విషయంలో వికీపీడియా ఏమీ తీసిపోదని వ్యాఖ్యానించింది. తప్పులు అసలే లేవని కాదంటూ చిన్న పొరపాట్లు వదిలేస్తే, సైన్సుకు సంబంధించి తాము పరిశీలించిన 42 వ్యాసాల్లో తీవ్రమైన తప్పులు నాలుగున్నట్టు వెల్లడించింది. బ్రిటానికాలో మూడు ఉన్నట్టుగా పేర్కొంది. దీనిమీదే విమర్శకుడు, జర్నలిస్టు బిల్‌థాంప్సన్‌ ఓ వ్యాఖ్య చేశాడు. 'ఏ సమాచారం కావాలన్నా నేను వెుట్టవెుదట చూసేది వికీపీడియా. నా అధ్యయనానికి అదే వెుదటి మెట్టు. అయితే ఏ విషయాన్నీ క్రాస్‌ చెక్‌ చేసుకోకుండా నిర్ధరించుకోను.' దీన్ని మనమూ అనుసరించొచ్చు.

ఇందులోని సమాచారం సమగ్రం కాకపోవచ్చు. ఇదే విషయాన్ని వికీపీడియా కూడా చెబుతుంది. కొత్త విషయం తెలుసుకోగోరేవారికి తొలి అడుగుగా ఉపకరిస్తుందనేది మాత్రం సత్యం. ఏ అంశం మీదైనా ప్రాథమిక అవగాహన ఇస్తుందనేది వాస్తవం. భారతదేశ విస్తీర్ణం ఎంతో తెలియదా? వికీపీడియాలోకి వెళ్లొచ్చు. ఫ్త్లెయింగ్‌ సాసర్‌ అంటే వివరణ కావాలా? వికీపీడియాలోకి వెళ్లొచ్చు. ఐక్యరాజ్యసమితి పూర్వాపరాలు కావాలా? వికీపీడియాలోకి వెళ్లొచ్చు. అంతెందుకు, ఐశ్వర్య తాజాగా ఏ సినిమాలో నటిస్తోందో తెలుసుకోవాలా? వికీపీడియాలోకి వెళ్లొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదో సమాచార సముద్రం. ఈదుకున్నవారికి ఈదుకున్నంత. మరి ఈతకు సిద్ధమా?

పదింతలు పెద్దది
ఒకరోజులో ఇంటర్నెట్‌ వినియోగించే పదిలక్షల యూజర్లలో సగటున 60,000 మంది వికీపీడియా సైట్లోకి వెళ్తున్నారు. అత్యధిక రికార్డు మూడున్నర లక్షలు.
* దర్శించేవారిలో 18-24 ఏళ్ల వయసు వారు 50 శాతం.
* చిన్నా, పెద్దా కలిపి వెుత్తం అరవై లక్షల ఆర్టికల్స్‌ ఉన్నాయి.
* ఇందులోని సమాచారం బ్రిటానికా ఎన్‌సైక్లోపీడియా కంటే పది రెట్లు ఎక్కువ.
* రిజిస్టర్‌ చేసుకున్న యూజర్లు సుమారు 25 లక్షలు.
* వెబ్‌సైట్ల ఆదరణను తెలిపే 'అలెక్సా టాప్‌ 500' లిస్టులో వెుదటిసారి 2004 అక్టోబరులో చేరింది. 2005 అక్టోబరు కల్లా నలభయ్యో స్థానానికి ఎగబాకింది. అత్యుత్తమ ర్యాంకు 11.
* వికీమీడియా(వికీపీడియా మాతృసంస్థ) కోసం పనిచేస్తున్న(జీతం తీసుకునే) ఉద్యోగులు కేవలం ఐదుగురు.
* వికీపీడియా అందుబాటులో ఉన్న భారతీయ భాషలు: తెలుగు, బెంగాలీ, కన్నడ, హిందీ, తమిళం, మలయాళం, ఉర్దూ, మరాఠీ, గుజరాతీ, సంస్కృతం, పంజాబీ, ఒరియా, కాశ్మీరీ, భోజ్‌పురి, మణిపురి, అస్సామీ. ఆంగ్లంతో పోల్చితే వీటి విస్తృతి చాలా తక్కువ. వెుదటిస్థానంలో ఉన్న తెలుగులోనే ఇరవైవేల వ్యాసాలున్నాయి.

సమాచారమే సంపద
కొత్త విషయం నేర్చుకోవాలన్న తపన మంచి జీవితానికి పునాది' అంటారు జిమ్మీ డొనాల్‌ వేల్స్‌. అదే ఆయన్ను వికీమీడియా ఫౌండేషన్‌ స్థాపించేలా పురిగొల్పింది. నలభై ఏళ్ల జిమ్మీవేల్స్‌ అమెరికాలోని అలబామా రాష్ట్రానికి చెందినవారు. తండ్రి కిరాణా కొట్టు నడిపేవారు. తల్లి, నాన్నమ్మ ఒంటి గది స్కూలు నడిపారు. 'జనరల్‌ నాలెడ్జ్‌ అంటే తెగ ఆసక్తి. చిన్నప్పుడే ఎన్‌సైక్లోపీడియా తిరగేసేవాడిని. బహుశా మా ఇంటి ప్రభావం కావొచ్చు' అంటారు జిమ్మీ. ఆర్థికంగా బలమైన కుటుంబం కాకపోయినా ఫైనాన్స్‌లో పీజీ చేశారు. చదువుకునే రోజుల్లోనే కాలేజీలో పార్ట్‌టైమ్‌ లెక్చరర్‌గా పనిచేశారు. పీహెచ్‌డీ చేయాలని ఇండియానా యూనివర్సిటీలో చేరినా మధ్యలోనే వదిలేశారు. చికాగోలో ఆరేళ్లు ట్రేడర్‌గా పనిచేశారు. తర్వాత, అంటే 1996లో 'బొమిస్‌ ఆన్‌లైన్‌ అడ్వర్త్టెజింగ్‌ ఏజెన్సీ' నెలకొల్పారు. అటుపై నాలుగేళ్లకు 'ఫ్రీ ఆన్‌లైన్‌ ఎన్‌సైక్లోపీడియా' ప్రారంభించాలన్న ఆలోచన వచ్చింది. అదే వికీపీడియా. దీనికి జిమ్మీ స్థాపించిన బొమిస్‌ ఏజెన్సీయే అత్యధికంగా నిధులు సమకూర్చింది. ప్రారంభం నుంచి 2004 వరకు సుమారు రెండున్నర కోట్ల రూపాయలు ఖర్చయినట్టు జిమ్మీ చెబుతున్నారు. ఇందులో ఎక్కువగా వెచ్చించింది హార్డ్‌వేర్‌కే. పెరుగుతున్న వెబ్‌ ట్రాఫిక్‌ దృష్ట్యా నెలకో అదనపు సర్వర్‌ అవసరమవుతోంది. అందుకే, 2005 చివరి త్రైమాసికంలోనే రూ.కోటిన్నరకు పైగా ఖర్చయిందని నివేదిక. వ్యక్తులు, సంస్థలు అందజేస్తున్న విరాళాలే వికీపీడియాను నడుపుతున్నాయి. ఈ ఏడాది టైమ్‌ మ్యాగజైన్‌ వెలువరించిన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో జిమ్మీ వేల్స్‌ ఒకరు.

ఆలోచనా వివాదం

సంబంధిత రంగంలో నిపుణులతో రాయించిన వ్యాసాలతో ఓ ఆన్‌లైన్‌ ఎన్‌సైక్లోపీడియా ప్రారంభించాలన్న ఆలోచన జిమ్మీ వేల్స్‌కు వచ్చింది. దానికోసం ఆయన 'న్యూపీడియా' ప్రారంభించారు. దానికి ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌గా లారీ సాంగర్‌ను నియమించుకున్నారు. 2000 సంవత్సరంలో ఈ ప్రాజెక్టు వెుదలైంది. అయితే ఆచీతూచీ ఆర్టికల్స్‌ ఎంపిక చేస్తుండడంతో పని మందకొడిగా సాగింది. దీంతో సాంగర్‌కు విసుగెత్తింది. యూజర్లనే భాగస్వాములను చేయాలన్న ఆలోచన వచ్చిందాయనకు. అంతే... ఓ పక్క న్యూపీడియా పని జరుగుతుండగానే 2001లో వికీపీడియా ప్రారంభమైంది. స్పందన అనూహ్యం. రోజురోజుకీ వ్యాసాలు పోగుపడ్డాయి. ఇక న్యూపీడియా కొనసాగించడం అనవసరం అనిపించింది జిమ్మీకి. దాంతో సాంగర్‌ 2002లో ఉద్యోగానికి రాజీనామా చేయాల్సివచ్చింది. ఇప్పుడు వికీపీడియాను స్థాపించిన గౌరవం ఎవరికి దక్కాలి? ఆ ప్రాజెక్టు రూపకల్పన చేసింది తాను కాబట్టి, తనకూ కో-ఫౌండర్‌ హోదా ఉండాలంటారు సాంగర్‌. ఓ ఉద్యోగి వ్యవస్థాపకుడు ఎలా అవుతాడంటారు జిమ్మీ. పైగా సాంగర్‌కంటే ముందే ఈ ఆలోచన తనకు ఓ బొమిస్‌ ఉద్యోగి చెప్పాడనీ అంటున్నారు. వివాదం కొనసాగుతోంది. అయితే ఇప్పటికీ వికీపీడియా సహ వ్యవస్థాపకుడిగా సాంగర్‌ను మీడియా కొన్నిసార్లు పేర్కొంటోంది.

ఇతర ప్రాజెక్టులు
లాభాపేక్ష లేకుండా సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలనేది 'వికీమీడియా ఫౌండేషన్‌' ఆశయం. వికీపీడియా విజయకేతనం ఎగరవేసిన తర్వాత, మరిన్ని ప్రాజెక్టులకు అంకురార్పణ జరిగింది. ఆంగ్లంతోపాటు ఇతర భాషల్లో ఇవి అందుబాటులో ఉన్నా ఇంగ్లిష్‌లోనే ఎక్కువ సమాచారం ఉంది.
విక్షనరీ
ఇది ఆన్‌లైన్‌ నిఘంటువు. పదాల అర్థాలు, వాడుక, పర్యాయపదాలు ఇందులో చూడొచ్చు. ఓ భాషలోని పదాన్ని ఇతర భాషల్లో ఏమంటారో ఇవ్వడం ఇందులో అదనపు ప్రయోజనం. (www.wiktionary.org)
వికీన్యూస్‌
ఆ రోజు ప్రధానాంశాలు ఇందులో ఉంటాయి. స్వచ్ఛందంగా వార్తలు అందించే సిటిజన్‌ జర్నలిస్టులే దీనికి ఆయువు. (www.wikinews.org)
వికీకోట్‌
నాయకులు, రచయితలు, శాస్త్రవేత్తలు వివిధ సందర్భాల్లో ఉటంకించిన వాక్యాలను ఇందులో చదువుకోవచ్చు (ఉదా: గాంధీజీ). సినిమా సంభాషణలు కూడా అందుబాటులో ఉన్నాయి. (www.wikiquote.org)
వికీబుక్స్‌
వివిధ రచయితలు రాసిన పుస్తకాలను యథాతథంగా అందించే ప్రయత్నమిది. ఇందులోనే చిన్న పిల్లల పుస్తకాల కోసం మరో ప్రాజెక్టు వికీజూనియర్‌. (www.wikibooks.org)
వికీమీడియా కామన్స్‌
ఎన్నో అంశాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, శబ్దాలు ఇందులో ఉన్నాయి. ఉదా: పికాసో పెయింటింగ్స్‌, చార్లీచాప్లిన్‌ సినిమా క్లిప్పింగ్స్‌ (www.commons.wikimedia.org)
వికీస్పీసిస్‌
వృక్షాలు, జంతువులు, బ్యాక్టీరియా సంబంధిత సమాచారం ఇందులో నిక్షిప్తం చేశారు. సైన్సు విద్యార్థులకు బాగా ఉపకరిస్తుంది. (www.species.wikimedia.org)
వికీవర్సిటీ
విద్యావకాశాలను తెలియజెప్పాలన్న ఉద్దేశంతో వెుదలుపెట్టారు. ఇంకా ప్రాథమిక దశలో ఉంది.

Courtesy: ఈనాడు


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


4 Comments:

At 12:42 PM, Blogger Unknown గారు చెప్పినారు...

This comment has been removed by the author.

 
At 9:43 AM, Anonymous obat kuat semarang గారు చెప్పినారు...

nice content.

 
At 9:44 AM, Anonymous sex shop గారు చెప్పినారు...

terima kasih atas informasinya,sukses selalu.

 
At 7:41 PM, Blogger Unknown గారు చెప్పినారు...

moncler jackets
canada goose jackets
giuseppe zanotti
supreme clothing
nike blazer
louboutin shoes
supreme shirt
louboutin shoes
coach outlet online0820
nike soldes femme

 

Post a Comment

<< Home