"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Saturday, October 07, 2006

వలసకూలీలమయ్యాం తెలుగుతల్లీ, క్షమించు!

శక్తిచాలనివాడు సాధుత్వం వహించినట్టుగా ప్రాంతీయభాషలన్నీ జాతీయ భాషను, అంతర్జాతీయ భాషనూ నెత్తిన మోస్తూ ఇచ్చిన కూలి తీసుకొని బతకవలసిందే గానీ, మరో మార్గం లేదు. అమృతభాషలు మృత భాషలు కాలేదా? ఎన్నో భాషామతల్లులు చనిపోయాయి.

పే ద జనానికి తెలుగు, ధనవంతులకు ఇంగ్లీష్‌ నేర్పుతూ అంతరాలను కొన సాగిస్తున్నారనే వాదం ఈ మధ్య గట్టిగా వినిపిస్తోంది. ఇంగ్లీషును దేశభాషగా మారిస్తే, ఇంగ్లీషునే అన్ని ప్రభుత్వపాఠశాలల్లో బోధిస్తే, అన్ని కులాల వారు విమానాలెక్కే స్థాయికి వస్తారని కొందరు అంటున్నారు. ఈ రకమైన ఆశ తప్పేమీ కాదు. కానీ ఇంగ్లీష్‌ భాషవల్లనే దళితులు, వెనుకబడిన తరగతులవారు, ముస్లింలు... బాగుపడతారా? అభివృద్ధికీ, అంతర్జాతీయ సౌకర్యాలు పొందడానికీ ఆంగ్లమే శరణ్యమని ప్రజలు ఎగబడడానికీ కారణాలు ఏమిటి? ఆ కారణాలను అన్వేషించి మన భాషకుకూడా ఆంగ్లమంతటి శక్తిని తెచ్చే ప్రయత్నాలు చేయకూడదా? ఆంగ్లానికున్నంత శక్తి తెలుగుకు రాదా? మన ప్రజలు తలుచుకొంటే ఇది సాధ్యంకాదా?

భాషకూ కులానికీ ముడిపెట్టడం అనవసరం. పెద్ద పెద్ద చదువులు ఇంగ్లీషులో చదివినవాళ్ళే అమెరికా వెళ్ళినా కులసంఘాలు వదడంలేదు. కులతత్వాన్ని, మత ఛాందసాన్ని ఇంగ్లీష్‌ పోగొట్టదు. పైగా తెలుగువాడిని ఇంగ్లీషులో హడలగొట్టే వాళ్ళు తయారయ్యారు. తెలుగు ముస్లింలను ఉర్దూ, అరబీలతో, తెలుగు హిందువుల్ని సంస్కృతంతో బెదిరించి బానిసలుగా చేసినట్టే, తెలుగు ప్రజల్ని నేడు ఇంగ్లీషుతో పాలిస్తున్నారు. అయినా ఇంకా తెలుగు చచ్చిపోలేదు.

దేశానికి లింకు భాష కావలసిరావడమే మన భాషకు పట్టిన దౌర్భాగ్యం. మనదేశ భాషలన్నీ స్వయంపోషకత్వాన్ని కోల్పోయి, వాడిపోయి రాలిపోయేదశకు చేరుకుంటున్నాయి. ఇంగ్లీష్‌ లింకు తెగితే ఆక్సిజన్‌ సరఫరా ఆగిపోయినట్లు దేశాలు విలవిలలాడుతున్నాయి. దేశభాషలన్నిటికీ ఇంగ్లీష్‌ సెలైన్‌ బాటిల్‌వలె పనిచేస్తోంది. వరల్డ్‌వైడ్‌ వెబ్‌లో ఈగల్లా చిక్కుకున్న అన్ని భాషల్నీ ఇంగ్లీష్‌ అనే సాలెపురుగు పీల్చి పిప్పిచేసింది. ఇంగ్లీష్‌ లేకుండా ఎవరి భాష వాళ్ళకు తెలిసే అవకాశంకూడా లేదనే పరిస్థితి దాపురించింది. ఇవన్నీ నిజాలు. మన భాషను ఇలాంటి స్థితిలో ఉద్ధరించడం సాధ్యమవుతుందా? మన భాషద్వారా ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధి కారులు రాగలరా? ఉపాధినిచ్చే భాషను ప్రజలు ఎగబడి నేర్చుకుంటారు. లక్షలాదిమందికి ఉపాధిని, విజ్ఞానాన్ని అందించగలస్థాయికి మనభాషను తీసుకుపోగలమా? అలాంటి ఆశ, అంకితభావం గలవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన పొలాన్ని మరొకడికి కౌలికిచ్చి, వాడి దగ్గరే కూలీగా పనిచేస్తున్నట్టుంది మన పరిస్థితి.

1984లో వావిలాల గోపాలకృష్ణయ్య ఇలా అన్నారు: 'ఆనాడు మనదేశంలోనే మనం బాని సలం. 1947లో బ్రిటిష్‌ వాళ్ళనుంచి స్వేచ్ఛను పొందాక మనభాష అభివృద్ధి చెందుతుందను కున్నాం. కానీ మన భాషాభివృద్ధికి అవసరమైన ప్రభుత్వం మనకు రాలేదు. అమెరికా పోయే నలు గురికోసం అంతా ఇంగ్లీష్‌ చదవాలా? అమెరికా వాళ్ళే వాడితోపాటు మా ఊళ్ళోఉన్న గుమాస్తాకు, తలారికికూడా ఇంగ్లీష్‌ నేర్పాలట. ఎందుకో మరి? మనప్రభుత్వం ప్రజలకు అర్థంకాకుండా పోయింది. ఇంగ్లీష్‌ మోజుదారులు మాకు ఇంగ్లీష్‌ అలవాటైపోయిందండీ అంటారు. మొదట పొరపాటు, తరువాత గ్రహపాటు, ఆ తరువాత అలవాటు. ఈ అలవాటు అనే ప్రమాదకరమైన శత్రువును నిషేధించకపోతే మనం ఇక ఈ స్థితిలోకూడా నిలవం. ప్రజాపాలన ప్రజల మాతృభాషలో ఉండాలి. తెలుగు ఇవాళ చదవకపోతే భాష మరచిపోతాం. భాష ఎంతమాట్లాడుతుంటే అంత వస్తుంది. ఎన్ని విషయాలు మాట్లాడితే అంత పదజాలం పెరుగుతుంది. మన భాషను నిరంతరంగా వాడితేనే తాజాగా ఉంటుంది, ప్రవహిస్తుంది. ఇన్ని సంవత్సరాల తరువాతకూడా ఇంగ్లీష్‌ వాళ్ళే మనల్ని పరిపాలిస్తున్నట్లుగా ఉంది. కాన్వెంట్‌ స్కూళ్ళు అంటువ్యాధికంటే ప్రమాదకరమైనవి. తెలుగురాని పిల్లవాడికి ఇంగ్లీష్‌ నేర్పుతున్నారు. మనభాష ఏమైపోతుంది?'

పూజారి నోట్లోని సంస్కృత మంత్రంలా, ముల్లా నోట్లోని అరబీ సూరాలా ఇంగ్లీష్‌ గొప్పశక్తి సంపాదించుకుంది. మంత్రాలొస్తేనే గదా పూజారి అయ్యేది? అలాగే ఇంగ్లీష్‌ వస్తేనే అధికారం, ఉద్యోగం దక్కుతున్నాయి. ఇంగ్లీష్‌వాడికంటె ఎక్కువజ్ఞానం తెలుగులో సంపాదించినా వ్యర్థం. ఎందుకంటె బోలెడంత విషయ పరిజ్ఞానంతో కూడిన తెలుగుకంటె, అసలు ఏ పరిజ్ఞానం లేకపో యినాసరే, వట్టి ఇంగ్లీష్‌ భాష వస్తేచాలు బతుకు తెరువు దొరుకుతుందని హామీ ఇస్తున్నారు. ఆంగ్ల భాషావాదుల అవసరం అలాందిమరి! హిందీ, ఇంగ్లీష్‌ రాని తెలుగువాళ్ళు ఒంటరివారిలా బతు కెలా గడుస్తుందోననే భయంతో ఉన్నారు. పరాజితులు విజేతల భాష నేర్చుకోక తప్పదు. గత్యంతరంలేకే తెలుగు వాళ్ళు హిందీ, ఇంగ్లీషులకు పట్టం గట్టారు. బతుకు తెరువుకోసమే ఆ భాషల పంచన చేరారు. ఇంగ్లీష్‌ గుంపులో చేరితేనే, 'ఇక ఫరవాలేదు బతుకుతాను' అనే నమ్మకం కలుగుతోంది. ఇంగ్లీష్‌ రాని శ్రీకృష్ణదేవరాయలు ఇప్పుడుంటే ఏం చేస్తాడు?

పక్షులు తమ కూతను మార్చుకోకపోయినా వల సవెళ్ళిన ప్రాంతాలనుబట్టి తమ అరుపుల్లో యాసను మారుస్తాయట. అవసరం అన్వేషణకు తల్లి అంటారు. పశువులు పక్షులేలే తమతమ భాషలతో ఆటలాడుకుంటుంటే, మనిషి ఊరుకుంటాడా? గుంపులుకట్టి కొన్ని భాషల్ని అధికారపీఠం మీద కూర్చోపెడతాడు, కొన్ని భాషల్ని అణిగిమణిగి పడిఉండమని ఆదేశిస్తాడు. ఒకదానిని దేవ భాష అంటాడు, ఒకదానిని అధికారభాష అంటాడు, మరొకదానిని బానిసభాష, పనికిమాలిన బాష అంటాడు. ఏమైనా శక్తిచాలనివాడు సాధుత్వం వహించినట్టుగా ప్రాంతీయభాషలన్నీ జాతీయ భాషను, అంతర్జాతీయ భాషనూ నెత్తిన మోస్తూ ఇచ్చిన కూలి తీసుకొని బతకవలసిందే గానీ, మరో మార్గం లేదు. అమృతభాషలు మృత భాషలు కాలేదా? ఎన్నో భాషామతల్లులు చనిపోయాయి.
అమ్మా తెలుగుతల్లీ, ఇక చచ్చిపో. ఎంతకాలం మంచంమీద రోగిష్టిలా ఉంటావ్‌! నిన్ను బాగుచేయించే ఆర్థికస్థోమత మాకు లేదు. అంత గొప్ప వైద్యమూ లేదని స్పెషలిస్టులూ తేల్చిచెప్పారు. నీవు ఇంట్లో వాళ్ళందరికీ అడ్డమైపోయావు అని నీ పిల్లలే విసుక్కుంటున్నారు. మొండి ప్రాణమే తల్లీ నీది. నీమీద మాకు ఎంతప్రేమఉన్నా ఏమీ చేయలేని అశక్తులం, బానిసలం, రెక్కాడితేగాని డొక్కాడని వలస కూలీలమయ్యాం. నిన్ను పోషించనందుకు మమ్మల్ని క్షమించమ్మా్సరచయిత రాష్ట్రప్రభుత్వఅధికారి

నూర్‌బాష రహంతుల్లా
Courtesy: వార్త

Telugu Indian language Andhra Pradesh Noorbhasha Rahamthulla


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


3 Comments:

At 6:26 PM, Blogger cbrao గారు చెప్పినారు...

చక్కటి వ్యాసాన్ని గురించి తెలియచెప్పినందుకు ధన్యవాదాలు.

 
At 10:00 PM, Anonymous Anonymous గారు చెప్పినారు...

ఒంట్లో రోగ నిరోధక శక్తి తగ్గితే యాంటీ బయాటిక్స్ ఇస్తాం. అలాగే మన మాతృ భాష పర భాష తో తొక్కించ బడుతున్నంత కాలం మనం ఇలాంటి వార్తలు మేలు కొలుపు వ్యాసాలు చూస్తు నే ఉంటాం. ఇవే యాంటీ బయాటిక్స్( దీనికి తెలుగు పదం నాకు తెలియడం లేదు) పర భాష మోజు అనే రోగాన్ని కొంత కాలం దూరం పెడుతుంది. మళ్ళీ షరా మామూలే ఇంకో మేలు కొలుపు వచ్చేదాకా.


విహారి.
http://vihaari.blogspot.com

 
At 12:12 PM, Anonymous Anonymous గారు చెప్పినారు...

Nice article, but at the same time think how India capitalized the outsourcing industry. Imagine if Indians couldn’t speak English, all the outsourcing industry would have been captured by Chinese like they captured the manufacturing. If you don't plug into the globalization where English is the universal language, u'll miss the boat. Look our surroundings, how many of our friends speak in English at home with their kids, the kids anyways learns English at school, why again talk to em in English, how many of our friends here in us say we don’t watch telugu movies any more as they are 3 hours long, I agree its their personal choice but dude these are the ones who should be educated in keeping the culture, tradition and language.
teaching telugu for poor and English for rich and creating the differences isn't true, but poor can't afford to go to missionary or convent schools, they will be left out, at least if you teach in English medium in all public schools they'll also have an opportunity to compete with the rest of the world, anyways after 12th you can't study engineering and medicine in telugu medium, so why not give them opportunity to learn English early. By making Telugu as mandatory first language we could still keep our language from not fading.
Don't think I'm against telugu, in fact I had the privilege to study in telugu medium till 10th class and I'm proud of it, at least I don't say like may of my friends here who are from AP proudly say I can't read and write telugu but I can speak, somehow they feel superior ny making these kind of statements.
~vinNY

 

Post a Comment

<< Home