Wednesday, September 19, 2007

యువరాజే రారాజు

Courtesy: ఈనాడు
12 బంతుల్లో అర్ధసెంచరీ
బ్రాడ్‌ ఓవర్‌లో ఆరు సిక్సర్లు
18 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై భారత్‌ విజయం

చుక్కలు చూపించడం... ఉతికి ఆరేయడం... ఇరగదీయడం... దిమ్మతిరిగేలా కొట్టడం... ఇంకేమైనా విశేషణాలు ఉంటే... అవన్నీ ఇంగ్లాండ్‌ జట్టుకు బుధవారం రుచిచూపించాడు.. పంజాబ్‌ పులి యువరాజ్‌సింగ్‌. తాడోపేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఆకలిగొన్న పులిలా రెచ్చిపోయాడు. ఒకే ఓవర్‌లో ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా ఆరు బంతులకు ఆరు సిక్స్‌లు కొట్టి ప్రత్యర్థి జట్టు వెన్నులో వణుకు తెప్పించాడు. అంతేకాదు... 12 బంతుల్లో 50 పరుగులు చేసి సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు. బుధవారం భారత్‌-ఇంగ్లాండ్‌ల మధ్య జరిగిన ట్వన్టీ20 పోరులో... 19 ఓవర్‌ క్రిస్‌బ్రాడ్‌ బౌల్‌చేశాడు. బ్రాడ్‌ వేసిన తొలి బంతిని మిడ్‌ఆన్‌ మీదగా భారీ సిక్స్‌గా మలిచిన యువరాజ్‌... ఆ తర్వాత బంతిని స్క్వేర్‌లెగ్‌ దిశగా స్టాండ్స్‌లోకి కొట్టాడు. మూడో బంతికీ అదే దుర్గతి. అయితే ఈసారి అది ఎక్స్‌ట్రా కవర్‌...! కెప్టెన్‌ కాలింగ్‌వుడ్‌ సలహాలు... బ్రాడ్‌ జిత్తులు... యువరాజ్‌ విధ్వంసక బ్యాటింగ్‌ ముందు చిత్త్తెపోయాయి. నాలుగో బంతి బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ మీదగా అలా అలా తేలిపోతూ స్టాండ్స్‌లో పడగానే... ఇంగ్లాండ్‌ ఆటగాళ్లలో నెత్తురు చుక్కలేదు. అప్పటివరకు ముఖంలో ఏవో భావాలు కనబడిన బ్రాడ్‌ నిస్తేజుడైపోయాడు. విసరాలా వద్దా అన్నట్టు విసిరిన ఐదో బంతి ఏకంగా ఫ్లడ్‌లైట్లు దాటిపోయింది. అప్పటివరకు సలహాలిచ్చిన కాలింగ్‌వుడ్‌ కూడా యువరాజ్‌ ఆరో సిక్స్‌ కొడతాడా లేదా అన్నట్టు ముఖం పెట్టాడు. భయపడుతూనే బంతిని వదిలిన బ్రాడ్‌ అంతకుముందు ఐదుసార్లు చూసినట్లే మరోసారి ఆకాశం వైపు చూసి నిశ్చేష్టుడైపోయాడు. యువరాజ్‌ ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతకుముందు ప్రపంచ కప్‌లో నెదర్లాండ్స్‌ మీద దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ గిబ్స్‌ ఒకే ఓవర్లో 6 సిక్స్‌ల రికార్డును యువీ సమం చేశాడు. ఈ 'ఆరే'సే క్రమంలో యువరాజ్‌ 12 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి వన్డే, టెస్ట్‌ ఏ క్రికెట్‌ అయినా అత్యంత వేగంగా అర్ధసెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా కూడా రికార్డు సృష్టించాడు. 1996లో సనత్‌ జయసూర్య పాకిస్థాన్‌పై 17 బంతుల్లో చేసిన హాఫ్‌ సెంచరీయే ఇప్పటిదాకా రికార్డు. యువీ, సెహ్వాగ్‌ విజృంభణలతో భారత్‌ 4 వికెట్లకు 218 పరుగులు చేసి ఈ టోర్నీలో రెండో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా రికార్డులకెక్కింది. లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్‌ చతికిల పడింది. ఆరువికెట్లను కోల్పోయి 200 పరుగులే చేయగలిగింది. అద్భుతంగా రాణించిన యువరాజ్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది.

Yuvraj Singh cricket India Indian six balls over sixes England score

No comments:

Post a Comment