Wednesday, September 07, 2005

వినాయక చవితి శుభాకాంక్షలు




ఆది పూజలు నీకె అఘనాశనాయ
అభిల ఘువనాలేగు అఖివాహనాయ
పాపులను శిక్షించు పాశ హస్తాయ
సర్వులను రక్షించ రార సర్వాయ




The following articles are courtesy ఈనాడు


గణపతి
భారతీయులకు గణపతి జీవనాధారమైన ఒక మూలతత్త్వం, జీవన తత్త్వం. అందువల్లే ప్రతి పనికీ ముందు గణపతిని పూజించి తమ పనులు నిర్విఘ్నంగా చేసుకుపోతుంటారు. బలం, బుద్ధి... రెండింటికి మూలాధారంగా ఉన్న గణపతిని ఒక ప్రబల పృధ్వీతత్త్వంగా పరిగణిస్తుంటారు.
గణపతి సిద్ధిని, బుద్ధిని, బలాన్ని, ఐశ్వర్యాన్ని అన్నింటినీ అనుగ్రహించగల పరబ్రహ్మంగా ఎందరో భక్తుల విశ్వాసం. విద్యాబుద్ధులు కలగడానికి సిద్ధిబుద్ధి రూపుడైన గణపతిని ఎందరో ఉపాసిస్తారు. స్వామి విఘ్నగణపతియే కాదు వరద గణపతి కూడ. గణపతి ఉపాసనవల్ల శత్రుక్షయమవుతుందనీ, రాక్షస బాధలుండవనీ పలువురి నమ్మకం. గణపతి కరుణా సముద్రుడనీ, పదవీభ్రష్టులకు రోగపీడితులకు సాంత్వన ప్రసాదిస్తాడనీ ఎన్నో కధలున్నాయి. సాధకుడు ఆరోగ్యవంతుడై సుఖసంపదలు పొందుతాడని శాస్త్ర వచనం.
''జ్ఞాన వాచకోగశ్చ, ణశ్చనిర్వాణ వాచకః
తయోరీశం పరబ్రహ్మ గణేశం
ప్రణమామ్యహం''
గకారం జ్ఞానవాచకం. ణకారం నిర్వాణ వాచకం. ఈ రెండింటికి ఈశుడు, అధిపతి గణపతియే అని అర్థం.
'గణానాం త్వాగణపతిగ్‌ం' అని ఋగ్వేదం గణపతిని గణాలకు అధిపతిగా పేర్కొన్నది. దేవమనుష్యాది సర్వ గణాలకు పతిగానున్నవాడు గణపతి.
గణపతి క్షిప్రప్రసాది. ఓంకార స్వరూపుడు, లంబోదరుడు. పాశ అంకుశాలు రాగద్వేషాలను నియంత్రించే ఆయుధాలు. లంబోదరం బ్రహ్మాండానికి సంకేతం. మోదకం అనగా ఆనందాన్ని ప్రసాదించేది! స్వామి మోదకప్రియుడు. 21 సంఖ్య గణపతికి ప్రీతి. స్వామికి 21 ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తారు. ఏకవింశతి పత్రాలతో గణేశపూజ జరిపితే ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని స్వామి ప్రసాదిస్తాడని ప్రతీతి.
గణేశ చవితినాడు, పత్రి, గరికతో స్వామి వ్రతమాచరించి శమంతకోపాఖ్యానం కధను విన్నవారికి నీలాపనిందలు రావని, అన్ని పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయని పురాణ కధలున్నాయి. సూర్యుడు నమస్కారప్రియుడు, విష్ణువు అలంకారప్రియుడు, శివుడు అభిషేకప్రియుడు, గణపతి తర్పణ ప్రియుడు.
త్రిపురాసురుని సంహరించిన శివుడు, మధుకైటభులను హతమార్చిన విష్ణువు, మహిషుని మర్దించిన పార్వతి, సృష్టిని నిర్మించిన బ్రహ్మ... వీరందరూ గణేశుని ప్రార్థించి విఘ్నాల పీడ తొలగించుకున్నవారేనని వివిధ పురాణ గాధలు తెలియజెబుతున్నాయి.
స్థితిపతి నిధిపతి అయిన విఘ్నేశ్వరుని పండుగ సర్వమానవాళికి సర్వసంపత్కరమైనది.
- డాక్టర్‌ మాచిరాజు వేణుగోపాల్‌

గణపతి జననం
వినాయక చవితినాడు చిన్నా, పెద్దా అంతా ఎంతో భక్తితో అర్చించుకునే గణపతి జననం గురించి పలు పురాణాలు పలు కధలను వివరిస్తున్నాయి. ఈ కధల్లోని సందేశం అంతా ఒక్కటే అయినా కధలలో కొద్దిపాటి మార్పులుండటానికి కారణం కల్పభేదాలేనని పండితాభిప్రాయం. స్కాంద పురాణాన్ని పరిశీలిస్తే శివుడి కోరిక మేరకు పార్వతి తన నలుగు పిండితో ఓ బొమ్మను ఏనుగు తలతోనే నిర్మించిందని ఉంది. పార్వతి ప్రార్ధన మేరకు ఆబొమ్మకు చవితి నాడు శివుడు ప్రాణం పోశాడు. నరకాసుర సంహారం కోసం శివుడు తన దేహాన్ని నలిచి ఆమృత్తికతో బొమ్మను చేసి ప్రాణం పోసి విఘ్నేశ్వరుడిని చేసినట్లుంది. శివపురాణంలో కూడా పార్వతి నలుగుపిండితోనే వినాయకుడు జన్మించినట్లు ఉంది. వాయు పురాణంలో కూడా ఇదే కనిపిస్తుంది. లింగపురాణం విషయానికి వస్తే రాక్షస సంహారం కోసం గణేశ రూపంలో శివుడే పార్వతిలో ప్రవేశించి తిరిగి గజవదనుడుగా పుట్టినట్లు కనిపిస్తుంది. వరాహపురాణంలో శివుడి నవ్వు నుండి వినాయకుడు పుట్టాడనీ, అతడి అందాన్ని పార్వతీదేవి తదేకంగా చూస్తుండటంతో శివుడికి కోపం వచ్చి అతడికి ఏనుగుతల, పెద్ద కడుపు లాంటి వాటితో వికృతాకారం వచ్చేలా చేశాడని ఉంది. బ్రహ్మ వైవర్తపురాణంలో శివపర్వాతులు కూడి ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి భిక్షను కోరాడని అప్పుడు పార్వతి ఆయనకు భిక్ష నివ్వటానికి వెళ్ళిందని ఉంది. ఇంతలో కృష్ణుడు అక్కడ మాయమై గణేశ రూపాన్ని ధరించి శివుడి తేజస్సులో కదలాడటాన్ని పార్వతి గమనించినట్లు ఉంది. ఆతరువాత శని ఆబాలుడి తలను చూసినప్పుడు అది తెగిపోవటం విష్ణువు ఏనుగుతలను తెచ్చి ఆబాలుడి తలకు అతికించటం కనిపిస్తుంది. వామన పురాణంలో పార్వతీదేవి ఒంటి నలుగుపిండి నుండే గణేశుడని సృష్టించినట్లు తన యోగశక్తి చేతనే ఆబాలుడికి ప్రాణం పోసినట్లు ఉంది. పద్మ పురాణంలో సున్ని పిండితో గజ ముఖంతో ఉన్న ఒక బొమ్మను పార్వతి చేసి దానితో ఆడుకుందని ఉంది. ఆతరువాత ఆమె ఆబొమ్మను గంగలోకి విసిరింది. అప్పుడు ఆ బొమ్మ ఓ అద్భుతమైన ఆకారంగా రూపుదిద్దుకుంది. సజీవంగా ఉన్న ఆబాలుడిని గంగా పార్వతులిద్దరూ తమ కుమారుడుగా భావించుకొని పెంచారని ఉంది. గణేశ ముద్గల పురాణాలలో సింధు అనే రాక్షసుడిని చంపటం కోసం పార్వతి గణపతి మంత్రాన్ని అనుష్ఠించిందని మహా చతుర్ధినాడు గణపతి పార్వతీదేవి సేవిస్తున్న మట్టి విగ్రహం నుండి సజీవుడుగా బయటకు వచ్చి పార్వతీ తనయుడయ్యాడని ఉంది. ఇలా పురాణాలలో గణపతి జననాన్ని గురించిన ప్రసిద్ధ కధలు మనకు కనిపిస్తున్నాయి. ఈ గణపతిని అర్చించే వారు, సాధన చేసేవారు సమాజంలో మనకు నిత్యం ఎందరెందరో కనిపిస్తారు. సాధకులకు గణపతి స్వరూపంలోని ఒక్కో అవయవం ఒక్కో సంకేతంగా కనిపిస్తుంది. ఏనుగుతల వివేకంతో కూడిన నిశ్చయ సామర్ధ్యానికి, దృఢ దీక్షకు గుర్తు. అనవసరంగా, అధికంగా మాట్లాడటంకన్నా ఎంతో శ్రద్ధగా వినడం మంచిదని తెలియచెప్పేందుకే పెద్దపెద్ద చెవులు ఉన్నాయంటారు. ఇతర జంతువులకు వేటికీ లేనంత విధంగా ఏనుగుకు ఓ విలక్షణ రీతిలో తొండం ఉంటుంది. తొండంతో ఏనుగు తలకు కావాల్సిన ఎన్నెన్నో కార్యాలను సాధిస్తుంది. అలాంటి ఓ ప్రత్యేకతను ప్రతిసాధకుడూ, మనిషి కలిగి ఉండాలని చెప్పేందుకే తొండం ఉందంటారు. దంతాల విషయానికి వస్తే మంచి చెడులకు, పాపపుణ్యాలకో వివేక అవివేకాలకు దంతాలు సూచకాలు, వినాయకుడికి ఉన్న రెండు దంతాలలో ఒకటి విరిగి ఉంటుంది. ఆవిరిగిన దంతం అహంకార అణచివేతను స్ఫూరింపచేస్తుంది. పెద్దనోరు విషయానికి వస్తే అనంత విశ్వానికి దాన్ని గుర్తుగా చెబుతారు. లంబోదరాన్ని సాధకులు బ్రహ్మాండానికి గుర్తుగా చెబుతారు. అల గణేశుడు గుకల విశ్వానికే, బ్రహ్మాండానికి అధిపతి అన్నది ఇక్కడ వినిపించే సూచన. కాలుమీద కాలు వేసుకొని ఉండటన్ని కూడా యోగసాధకులు తమ సాధనకు సంకేతంగా భావిస్తారు. వినాయకుడి రెండు కాళ్ళు ఒకటి మనస్సుకు, రెండోది బుద్ధికి సంకేతం. ఈ రెండింటిలో చలించని కాలు మనస్సుకి, కిందికి వేలాడు పద్మంపైన కానీ, ఆసనంపైన కానీ ఆనించి ఉన్న కాలు బుద్ధికి ప్రతీకలుగా భావిస్తారు. మనసును, బుద్ధితో నిమగ్నం చేసి సాధకుడు యోగసాధన చెయ్యాలన్న దానికి ఇది సూచన. నాగ యజ్ఞోపవీతం విషయానికి వస్తే క్రూరమైన విష ప్రవృత్తిని నిగ్రహించి యజ్ఞసూత్రంలా చేసుకోవటమంటే దుస్సాధ్యమైన మనసును నిగ్రహించే సామర్ధ్యాన్ని పెంచుకోవటమే అంటారు. ఇక ఎలుక వాహన విషయానికి వస్తే ఎలుక కన్నం మొదలు చాలా చిన్నదిగా ఉంటుంది. లోపలికి వెళ్ళిన కొద్దీ ఎంతో విశాలంగా ఉంటుంది. బలహీనతలు మొదట చిన్నవిగా ఉంటాయని, ఆతరువాత అవి లోపలికి వెళ్ళిన కొద్దీ ఎక్కువ విశాలమై మొత్తాన్ని నాశనం చేస్తాయని కాబట్టి వ్యసనాలు లాంటి వాటి విషయంలో ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని చెప్పే హెచ్చరిక ఉంటుంది. గణేశునికి వస్తే ఒక చెయ్యి మనసుకు, రెండోది బుద్ధికి, మూడోది చిత్తానికి, నాలుగోది అహంకారానికి సంకేతాలు. ఈ నాలుగింటికీ మూలమైన శుద్ధతత్వమే గణపతి తత్వమని సూచించేందుకు ఈనాలుగు చేతులుంటాయి. ఇలా గణపతి ఆవిర్భావ, రూప, భావాలను గురించి మన పురాణాలు వివరిస్తున్నాయి.
డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు

ఏకదంతుడు
ణేశుడు ఏకదంతుడుగా ఎందుకుంటాడు? ఆ గజముఖుడికి ఉన్న రెండు దంతాలలో ఒక దంతం ఎప్పుడు విరిగింది? అనే ప్రశ్నలకు సమాధానాన్నిచ్చే కధ బ్రహ్మ వైవర్త పురాణం గణేశఖండం నూట నలభైమూడో అధ్యాయంలో కనిపిస్తుంది. పరశురాముడికి, గణేశుడికి జరిగిన యుద్ధంలో గణపతి దంత భంగం జరిగింది. ఆ యుద్ధం జరగటానికి వెనుక ఓ బలమైన కారణమే ఉంది. పరమేశ్వరుడిని మెప్పించి ఆయన వద్ద అమోఘ శస్త్రాస్త్రలను గ్రహించిన పరశురాముడు ఓసారి తన గురువు, తన దైవమూ అయిన పరమేశ్వరుడిని దర్శించటానికి కైలాసానికి వెళ్ళాడు. ఆ సమయంలో పార్వతీపరమేశ్వరులు ఏకాంతంలో ఉన్నారని వారినప్పుడు దర్శించటానికి వీలులేదని ద్వారం వద్ద ఉన్న గణేశుడు పరశురాముడిని నిలువరించాడు. అప్పుడు పరశురాముడు తాను కూడా పరమేశ్వరుడి తనయుడినేనని ప్రస్తుతం తాను వెనువెంటనే పరమేశ్వరుడిని చూడాల్సిన అవసరంఉందని గణేశుడికి చెప్పాడు. గణపతి ఆమాటలను వినలేదు. పరశురాముడిని పూర్తిగా అడ్డుకున్నాడు. అయినా రాముడు ఈశ్వర దర్శనార్థం లోపలికి వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నం చేశాడు. ప్రీతితో వారించాడు గణేశుడు. పరశురాముడికి కోపం మితిమీరింది. ఇద్దరి మధ్యన వాగ్వివాదం జరిగి బలాబలాలు తేల్చుకొనే స్థితికి వచ్చారు. వెంటనే పరశురాముడు తన చేతిలోఉన్న గండ్ర గొడ్డలిని గణపతి మీదకు విసరాలనుకున్నాడు. ఆ పక్కనే ఉన్న కార్తికేయుడు ఇదంతా చూసి పరశురాముడిని వారించి గురుపుత్రుడైన వినాయకుడి మీదకు గండ్రగొడ్డలి విసరబోవటం మందిపని కాదని వెను తిరగమని నిలువరించాడు. అయినా పరశురాముడికి కోపం ఆగలేదు. గణేశుడి మీదకి విసురుగా వెళ్ళాడు. అప్పటికే గణేశుడు ఎంతో శాంతంగా వ్యవహరించాడు. ఈశ్వరాజ్ఞలేకుండా లోపలికి వెళ్శటం మంచిదికాదని విద్యాసంబంధంవల్ల తనకు పరశురాముడు సోదరుడు లాంటివాడని కాబట్టి తనమాట వినమని ఎంతగానో నచ్చచెప్పాడు. కోపావేశంతో ఉన్న పరశురాముడికి ఆ మాటలేమి వినిపించలేదు. గండ్ర గొడ్డలి విసిరే ప్రయత్నం చేయబోయేంతలోగా గణేశుడు యోగశక్తితో తనతొండాన్ని కోటి యోజనాల వరకూ పెంచాడు. ఆ తొండంతో పరశు రాముడిని చుట్టి చిన్న పామును గరుత్మంతుడు పట్టి ఎత్తినట్లుగా ఎత్తి సప్త ద్వీపాలనూ, శైలాలనూ, మేరువునూ, సకల సాగరాలనూ క్షణంలో గిరగిరా పరశురాముడిని తిప్పుతూ చూపించాడు వినాయకుడు. ఆ దెబ్బకు ఆ రాముడికి కాళ్ళూచేతులూ స్వాధీనం తప్పాయి. సర్వ అవయవాలలోనూ ఒణుకుపుట్టింది. మళ్ళీ మరుక్షణంలో భూలోకం, భూవర్ణోకం, స్వర్లోకం, జనలోకం, తపోలోకం, ధ్రువలోకం ఇంకా ఆపైన ఉన్న గౌరీలోకం, శంభులోకాలను అన్నిటినీ పరశురాముడికి చూపించాడు గణేశుడు. ఆ తరువాత సప్త సాగరాలను తన తొండంతో పీల్చి వేశాడు. మళ్ళీ వెంటనే మొసళ్ళతో జల జంతువుల సహా తాను పీల్చిన జలన్నంతా వెలికి చిమ్మాడు. ఆ గంభీర సాగరోదకంలో పరశురాముడిని విసిరేశాడు. ఈ నీటిలో ఈదుతూ ప్రాణాలు దక్కించుకోబోతున్న పరశురాముడిని మళ్ళీ తొండంతో చుట్టి బ్రహ్మండం కంటే పైన గిరగిరా తిప్పి వైకుంఠాన్ని, చతుర్భుజుడిని, లక్ష్మిని చూపించాడు. ఆ తరువాత గోలోకాన్ని అత్యుత్తమమైన విరజను చూపించాడు. బృందావనాన్ని, నూరు శిఖరాలుగల పర్వతాన్ని, గోపీ గోపాదులతోపాటు శ్యామసుందరుడు, ద్విభుజుడు, మురళీహస్తుడు, చిరునవ్వువాడు, కోటి సూర్య తేజస్సు కలవాడు అయిన శ్రీకృష్ణుడిని చూపించాడు. పార్వతీ తనయుడైన వినాయకుడలా పరశురాముడిని తనయోగశక్తి ఎంతటిదో చాటి చెప్పాడు. అయినా పరమేశ్వరుడి శిష్యుడైన పరశురాముడు గణేశుడి మీదకు తన పరశువును విసిరాడు. అది వేగంతో వెళ్ళి గణేశుడి దంతాన్ని మొదలంటా తెగగొట్టి మళ్ళీ తిరిగి రాముడి దగ్గరకు వచ్చి చేరింది. ఆక్షణంలో ఆకాశంలో దేవతలంతా భయభ్రాంతులయ్యారు. పార్వతీ పరమేశ్వరులక్కడికి వచ్చారు. పార్వతి వెంటనే పక్కనే ఉన్న స్కందుడిని ఏం జరిగిందని దుఃఖంతో అడిగింది. విషయం తెలుసుకున్న ఆమె పరశురాముడిని శపించబోయింది. ఇంతలో పరశురాముడు ఆమాతను త్రికరణశుద్ధిగా స్తుతించి తనను రక్షించమని వేడుకున్నాడు. పరశురాముడు కూడా తనయుడితో సమానుడే కాబట్టి ఆమె కోపం ఆ స్తుతులకు వెంటనే చల్లారింది. పరశురాముడికి అభయానిచ్చి విఘ్నేశుడిని ప్రేమతో లాలించి పరిస్థితి చక్క బరిచింది. ఈ కధా సందర్భంలో గణేశుడికి ఒక దంతమే ఉండటానికి కారణం ఏమిటో కనిపిస్తుంది. ఒక తల్లి పిల్లలు ఒకరినొకరు కొట్టుకున్నప్పుడు తల్లి ప్రదర్శించే ప్రేమలాంటి ప్రేమను పార్వతీమాత గణేశ, పరశురాముల మీద చూపినట్లుగా బ్రహ్మ వైవర్త పురాణం వివరిస్తోంది.


గణపతి పత్రపూజ
పండుగలలో వినాయక చవితికి అన్నిటికంటే ఓ ప్రత్యేకత ఉంది. 21 రకాల పత్రాలతో అంటే ఆకులతో విఘ్నేశ్వరుడికి పూజ చేస్తారు. ఈ ఆకుల పూజ.. అందులోనూ ఇన్ని రకాల పత్రాలతో వినాయకుడికి పూజ చేయటమేమిటి అనే సందేహం కలుగుతుంది. ఆ సందేహానికి సమాధానంగా మన పురాణలలో అనేక చోట్ల వివరణలున్నాయి. వినాయకుడికి సమర్పించే 21 రకాల ఆకులలోనూ మంచి ఔషధ గుణాలున్నాయి. ఇలాంటి మందుల లక్షణాలున్న ఆకులను చిన్ననాటి నుంచే పిల్లలకు పూజ పేరుతో పరిచయం చేస్తే వారి జీవితాలకు ఎంతో మేలు కలుగుతుందనేది దీని వెనుక దాగిన అసలు విషయం. వీటి వివరాల్లోకి వస్తే... 21 రకాల ఆకులలో మొదటిది మాచీపత్రం. దీన్నె మాచిపత్రి అంటారు. దీని కషాయాన్ని ఉపయోగిస్తే శరీరం మీద ఏర్పడిన దద్దుర్లు, వ్రణాలు తగ్గుతాయి. ఇది కుష్టు వ్యాధికి తగిన మందని చెబుతారు. నరాల బలహీనతలను పోగొట్టి తలనొప్పులను, వాతం నొప్పులను తగ్గిస్తుంది. కళ్ళకు చలువచేస్తుంది. మానసిక వికాసానికి తోడ్పడుతుంది. రెండోది బృహతీ పత్రం. దీన్నే వాకుడాకు అని అంటారు. ఉబ్బసం, శ్వాస సంబంధ వ్యాధులు, శ్లేష్మం, దగ్గు, క్షయ, హృద్రోగం లాంటి వాటికి, వీర్య వృద్ధికి మంచిది. మూడోది బిల్వపత్రం, దీన్నే మారేడు ఆకు అని కూడా అంటారు. బిల్వపత్రం త్రిదళం. ఇది శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైంది. మారేడు పండ్ల గుజ్జు బంకలా పనిచేస్తుంది. విరోచనాలను తగ్గిస్తుంది. నాలుగో పత్రం గరిక, ఇది ఎత్తుగా పెరిగే గడ్డి. దీంట్లో ఎన్నో రకాల ఔషధ విలువలున్నాయి. పశువులకు మంచి ఆహారం. తర్వాతది దత్తూర పత్రం. దీన్నే ఉమ్మెత్త ఆకు అని అంటరు. దీనిలో నల్ల ఉమ్మెత్త శ్రేష్ఠమైనది. ఈ ఆకులకు ఆముదం రాసి దీపపు సెగచూపి గడ్డలపైన, పుండ్లపైన అద్దితే అవి తొందరగా తగ్గిపోతాయి. లైంగికపరమైన వ్యాధులకు కూడా ఇది మంచి మందు. ఆ తర్వాతది బదరీ పత్రం. దీన్నే రేగు ఆకు అని అంటారు. ఇది జీర్ణకోశ వ్యాధులకు చక్కగా పనిచేస్తుంది. రక్తదోషాలను హరిస్తుంది. లేత రేగు ఆకులను మిరియపు గింజలతో కలిపి తింటే వీర్య నష్టం తగ్గుతుంది. అరికాలు, అరిచేతుల మంటలకు ఈ ఆకు రసాన్ని మందుగా వాడతారు. అపామార్గ పత్రం అంటే ఉత్తరేణి ఆకు అని అర్థం. ఇది పంటి జబ్బులకు మంచి ఔషధం. అందుకే ఉత్తరేణి వేరును కూడా పళ్ళు తోముకునేందుకు పుల్లలాగా వాడతారు. తులసీపత్రం అంటే తులసి ఆకు. ఇందులో విష్ణు తులసి, కృష్ణ తులసి లాంటి రకాలున్నాయి. కడుపునొప్పి, పసిపిల్లలో వచ్చే గర్భశూలకు మందుగా వాడతారు. ఇది చర్మ రోగాలను నివారిస్తుంది. పూజకు ఉపయోగించే మరో పత్రం చూలు. ఇదే మామిడాకు. గృహ అలంకరణకు సర్వమంగళ కార్యాలకు తోరణంగా దీన్ని వాడతారు. మేహం వల్ల వచ్చే మంటలను తొలగిస్తుంది. కరవీర పత్రం అంటే గన్నేరు ఆకు అని అర్థం. ఇది శరీరం మీద వచ్చే గడ్డలను అరికడుతుంది. విషానికి విరుగుడు. దురదలు, దద్దుర్లు, కుష్టులాంటి వాటికి మందు. విష్ణుక్రాంత పత్ర కషాయం.. పైత్య జ్వరాలకు, కఫ జ్వరాలను హరిస్తుంది. వీటి ఆకులు ఎండపెట్టి నిప్పులలో వేసి ఆ పొగను పీలిస్తే దగ్గు, ఉబ్బసం తగ్గుతాయి. దాడి మీపత్రం అంటే దానిమ్మ ఆకు. జీర్ణకోశ, మలాశయ వ్యాధులకు మంచి ఔషధం. నీళ్ళ విరోచనాలను తగ్గిస్తుంది. దీని కషాయాన్ని తాగితే ఏలికపాములు, నాడాపాములు నశిస్తాయి. నోటిపూత తగ్గటానికి దానిమ్మ చిగుళ్ళను నములుతారు. పూజలో వినియోగించే మరో పత్రం దేవదారు. ఇది మేహశాంతిని కలిగిస్తుంది. ఈ ఆకులతో కాచిన తైలం కళ్ళకు చలువ చేస్తుంది. దేవదారు పువ్వులలో కూడా ఔషధ గుణాలున్నాయి. మరువక పత్రం అంటే మరువం అని అర్థం. స్త్రీలు తలలో ముడుచుకుంటారు. దీనిలో జీర్ణశక్తిని పెంచే లక్షణముంది. ఇంద్రియ పుష్టిని కలిగిస్తుంది. జుట్టురాలనివ్వదు. సింధూర పత్రాన్నే వావిలాకు అంటాం. దీని కషాయం జ్వరాలకు మందులాగా పనిచేస్తుంది. మేహ వాత నొప్పులు, కాళ్ళ నొప్పులను సాంత్వన పరుస్తుంది. జాజి ఆకులు వాతానికి, పైత్యానికి విరుగుడు. జీర్ణాశయ, మలాశయ రోగాలను తగ్గిస్తాయి. నోటిపూత, నోటి దుర్వాసనలను పోగొడతాయి. కామెర్లు, చర్మ వ్యాధులు, పక్షవాతం, తలనొప్పిలాంటి వాటికి ఈ ఆకులు మందుగా ఉపకరిస్తాయి. ఇది జాజికాయ, జాపత్రికి చెందింది. జాజిమల్లే రకం కాదని పండితులు చెబుతున్నారు. గండకీ పత్రం ఇది అంత సులువుగా లభ్యం కాదు. దీనిలో కూడా అనేక వ్యాధులను తగ్గించే ఔషధ గుణాలున్నాయి. శమపత్రం అంటే జమ్మి ఆకు అని అర్థం. ఇది కఫాన్ని, మూల, కుష్టు వ్యాధులను నివారిస్తుంది. అశ్వత్థ పత్రం అంటే రావి ఆకు. ఇది జ్వరాలకు, నోటిపూతకు మందుగా ఉపకరిస్తుంది. రావి పండ్లను ఎండపెట్టి చూర్ణం చేసి సేవిస్తే శ్వాసకోశ సంబంధ వ్యాధులు పోతాయి. అర్జున పత్రాన్నే మద్ది ఆకు అంటారు. ఇందులో తెల్లమద్ది, నల్లమద్ది అని రెండు రకాలున్నాయి. తెల్లమద్దిని మేహశాంతికి, వ్రణాలు, చెవినొప్పులు తగ్గటానికి వాడతారు. నల్లమద్ది మలాశయ వ్యాధులను పోగొడుతుంది. అర్కపత్రం అంటే జిల్లేడు ఆకు అని అర్థం. దీనిలో మూర్చ వ్యాధిని తగ్గించే ఔషధ గుణాలున్నాయి. పాము, తేలు కరిచినప్పుడు విషం విరుగుడుకు దీన్ని వాడతారు. ఇలా 21 రకాల ఆకులను గురించి, వాటి ప్రయోజనాలను అందరూ తెలుసుకోవాలనే లక్ష్యంతో పత్ర పూజను నిర్దేశించారు. కొంతమందికి ఇవేవీ తెలియక ఏవో ఆకుల కట్టలను తెచ్చి పత్రి అంటూ చెప్పి వాటితోనే పూజచేస్తారు. వీటిద్వారా పూజాఫలం లభించదు. ఈ 21 రకాల ఆకులలో గొప్పగొప్ప ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద శాస్త్రం పేర్కొంటోంది.

వినాయక వ్రత కల్పం
వినాయకచవితి పండుగనగానే చిన్నా పెద్దా అందరికి ఒక గొప్ప సంబరంగా ఉంటుంది. బొజ్జ గణపయ్యను భక్తితో పూజించటానికి అంతా ఎంతో ఉత్సాహాన్ని కనబరుస్తుంటరు. మామిడాకుల తోరణాలు, పూలు, పళ్ళు, మొక్కజొన్న పొత్తులు, అరటి పువ్వులు, అరటి పిలకలు ఇలా ఒకటేమిటి రకరకాల పచ్చపచ్చటి ప్రకృతంతా ఒక్కచోట కొలువుతీరినట్టు వినాయకుడి పాలవెల్లిని సింహాసనాన్ని తీర్చిదిద్దటంలోనే ఓ గొప్ప ఆనందాన్ని అంతా పొందుతుంటరు. ఇక్కడ చిన్న చిక్కు సమస్య ఒకటి కొద్దిగా పెద్దవారిలో తలెత్తుతుంది. పూజ ఎలా చేయాలో అర్ధం కాక పూజా క్రమంలో ముందేదో వెనుకేదో తెలియక తికమక పడుతుంటారు. అలాంటి తికమకలను పొందకుండా విఘ్ననాయకుడి పూజను పరమ సంతోషంగా నిర్వహించేందుకు ఓ మార్గదర్శక విధానాన్ని వ్రతకల్పాలు మనకు సూచిస్తున్నాయి.

వినాయకుడిని ముందుగా అందరూ ఎందుకు ధ్యానించాలి? ఎందుకు పూజించాలి? అనే ప్రశ్న తలెత్తుతే దానికి సమాధానాన్ని 'స్కందపురాణం' చెబుతుంది. సాక్షాత్తూ పరమేశ్వరుడే వినాయకుడి గొప్పతనాన్ని దేవతలందరికి చెప్పి ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా వినాయకుడిని పూజించాలని, అలా పూజిస్తే ఆపదలు తొలగటమేకాక, కార్యజయం కూడా కలుగుతుందని చెప్పాడు.

మనకు బహుళ ప్రచారంలో ఉన్న వినాయక వ్రత విధానాన్ని పరిశీలిస్తే అన్నీ మనం సులువుగా చేసుకునే అంశలే ఉంటాయి. ముందుగా వినాయక పూజకు కావలసిన ద్రవ్యాలను పరిశీలిస్తే... పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, రెండు పాత్రలు, రెండు భరిణెలు, అగరవత్తులు, హారతికర్పూరం, రెండు కొబ్బరికాయలు, ఓ డజను అరటిపళ్ళు, 40 తమలపాకులు, 12 వక్కలు, పత్తి, వెడల్పుగా ఉండే రెండు పళ్ళలు, జేగంట, తుండుగుడ్డ, పాలవెల్లి, పత్తితో చేసిన రెండు యజ్ఞోపవీతాలు, కుంకుమలో అద్దిన ఎర్రటి వస్త్రాలు, దీపారాధన నూనె, అయిదు తమలపాకులు, రెండు వక్కలు, రెండు అరటి పండ్లతో ఉన్న ఆరు తాంబూలాలు, వినాయక ప్రతిమలు, ఒకటి మట్టిది, రెండవది మామూలుది, 21 రకాల పత్రి(ఆకులు), విడిపూలు, పిల్లలు చదువుకునే పుస్తకాలు, పండుగనాడు సాయంత్రంవేళ ధరించే కొత్త వస్త్రాలు, పంచామృతం (తేనె, పెరుగు, పాలు, పంచదార, నెయ్యి కలిపిన పదార్ధం) వీటన్నింటిని పూజకు ముందుగా సిద్ధం చేసుకోవాలి.

పూజా విధానం
పూజా విధానంలో ప్రధానంగా 27 అంశాలు ఉంటాయి. ధ్యానం, ఆచమనం, భూతోచ్చాటనం, ప్రాణాయామం, సంకల్పం, కలశ పూజ, వినాయక ధ్యానం, ఆవాహనం, ఆసనం, ఆర్ఘ్యం, పాద్యం, ఆచమనం, పంచామృత స్నానం, ఫలోదకం (కొబ్బరినీరు)తో స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, ధవళాక్షతలు, అంగపూజ, పత్రిపూజ, అష్టోత్తర, శతనామ పూజ, ధూపం, దీపదర్శనం, నైవేద్యం, తాంబూలం, మంత్రపుష్పం, వినాయక పద్యాలను చదవటం అనే ఈ 27 అంశాలను ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ రావాలి.
తొలిగా ధ్యాన విషయానికి వస్తే...
శ్లో|| శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్‌|
ప్రసన్నవదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోప శాంతయే||
శ్లో|| సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః|
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః||
శ్లో|| ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః|
వక్రతుండ శ్శూర్పకర్ణః హేరంబ స్కందపూర్వజః||
షోడశైతాని నామాని యః పరేత్‌ శృణుయాదపి|
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా||
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే||
శ్లో|| అగజానన పద్మార్కం - గజానన మహర్నిశం|
అనేకదంతం భక్తానామ్‌ - ఏకదంత ముపాస్మహే||
శ్లో|| గజాననం భూతగణాది సేవితం|
కపిత్థ జంబూఫలసార భక్షణం||
ఉమాసుతం శోకవినాశ కారణం|
నమామి విఘ్నేశ్వర పాదపంకజమ్‌||
ఇప్పుడు ఓంకేశవాయస్వాహా, ఓంనారాయణయస్వాహా, ఓంమాధవాయస్వాహాఅంటూ మూడు సారులు ఆచమనం ( చేతిలో ఉద్ధరిణతో నీటిని కుడి అర చేతిలో పోసుకొని చప్పుడుకాకుండా త్రాగాటం) చేయాలి.
ఇప్పుడు..
ఓం గోవిందాయనమః, ఓం విష్ణవేనమః, ఓం మధుసూదనాయనమః
ఓం వామనాయనమః, ఓం శ్రీధరాయనమః, ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః,ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం జనార్థనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః అని పలకాలి.

భూతోచ్చాటనం...
శ్లో|| ఉత్తిష్టంతు భూతపిశాచః ఏతే భూమి భారకాః
ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారంభే|| అంటూ అన్ని దిక్కులవైపూ కొద్దికొద్దిగా నీళ్ళు చల్లాలి.

ఆ తర్వాత ప్రాణాయామం (బొటనవేలితో ముక్కు కుడి వైపు రంధ్రాన్ని మూసి ఎడమవైపు రంధ్రం గుండా గాలిని పీల్చి కొద్ది సేపటి తరువాత ఎడమవైపు రంధ్రాన్ని వేలితో మూసి కుడివైపు రంధ్రం గుండా గాలిని బయటకు వదలాలి)
''ఓం భూః, ఓం భువః, ఓగ్‌ం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్‌ం సత్యం, ఓం తత్స వితుర్వ రేణ్యం, భర్గోదేవస్య ధీమహి, ధియోయోనః ప్రచోదయాత్‌|| ఓ మాపోజ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భవస్సుఃవరోం'' అని పలకాలి.
అనంతరం ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి
మమ ఉపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్దం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞయ ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్దే, శ్వేత వరహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రధమపాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, కృష్ణాకావేర్యోః మధ్య దేశే, స్వగృహే (సొంత ఇల్లు కానప్పుడు''వసతిగృహే'' అనుకోవాలి) సమస్త దేవతా హరిహర సన్నిధౌ ఆస్మిన్‌ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన శ్రీపార్థివనామ సంవత్సరే, దక్షిణయనే, వర్షర్తౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్ధ్యాం సౌమ్య(బుధ)వాసరే, శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణే, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిధౌ మమ...
శ్రీమాన్‌/శ్రీమతః... గోత్రోద్భవస్య... నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య సహకుటుంబానాం, క్షేమస్త్థెర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం, ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం, అష్ట ఐశ్వర్యాది యోగ్యతా ఫలసిద్ధ్యర్థం సర్వదేవతా ప్రసాద సిధ్యర్దం శ్రీ మహాగణధిపతి పూజాం కరిష్యే...(ఉంగరం వేలితో నీటిని తాకాలి)
సంకల్పం చెప్పుకున్న తర్వాత కలశ పూజ చేయాలి.
శ్లో|| కలశస్య ముఖే విష్ణుః, కంఠే రుద్ర స్సమాశ్రితః|
మూలే తత్రస్థితోః బ్రహ్మా, మధ్యే మాతృ గణస్మృతః||
కుక్షౌతు సాగరా స్సర్వే, సప్తద్వీపా వసుంధరా|
ఋగ్వేధొధ యజుర్వేదో స్సామవేదోహ్యధర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః||

వినాయక ధ్యానం
శ్లో|| భవ సంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణా|
విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజే||

శ్లో|| ఏక దంతం శ్శూర్ప కర్ణం గజవక్త్రం చతుర్భుజం|
పాశాంకుశ ధరం దేవం ధ్యాయేత్‌ సిద్ధి వినాయకం||

శ్లో|| ఉత్తమం గణనాధస్య వ్రతం సంపత్కరం శుభం|
భక్తాభీష్ట ప్రదం తస్మాత్‌ ధ్యాయేత్‌ విఘ్ననాయకం||
శ్రీ వినాయకాయనమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి.

ఆవాహనం
శ్లో|| అత్రాగచ్చ జగద్వంద్య - సుర రాజార్చి తేశ్వర|
అనాధ నాధ స్సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవా||
శ్రీ సిద్ధి వినాయకాయ నమః ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి.

ఆసనం
శ్లో|| మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్న విరాజితం
రత్న సింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం||
శ్రీ వినాయకాయ నమః ఆసనం సమర్పయామి అంటూ అక్షతలు చల్లాలి.

అర్ఘ్యం
శ్లో|| గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన|
గృహాణర్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షితైర్యుతం||
శ్రీ సిద్ధి వినాయకాయ నమః అర్ఘ్యం సమర్పయామి అంటూ ఉద్దరిణతో నీటిని తీసుకొని వదలాలి.

పాద్యం
శ్లో|| గజవక్త్రం నమస్తుభ్యం సర్వాభీష్ట ప్రదాయకం|
భక్తా పాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన||
శ్రీ సిద్ధి వినాయకాయ నమః పాద్యం సమర్పయామి అంటూ నీటిని వదలాలి.

ఆచమనం
శ్లో|| అనాధ నాధ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత|
గృహాణచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో||
శ్రీ సిద్ధి వినాయకాయ నమః ఆచమనీయం సమర్పయామి అంటూ నీటిని వదలాలి.

మధుపర్కం
శ్లో|| దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం|
మధుపర్కం గృహేణేదం గజవక్త్ర నమోస్తుతే||
శ్రీ వినాయకాయ నమః మధుపర్కం సమర్పయామి

పంచామృత స్నానం
స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక|
శ్రీనాధ నాధ సర్వజ్ఞ గీర్వాణ గణపూజితా||
శ్రీ సిద్ధి వినాయకాయ నమః పంచామృత స్నానం సమర్పయామి

కొబ్బరి నీటితో స్నానం
గంగాది సర్వ తీర్దేభ్యః ఆహృతైరమలైర్జలైః|
స్నానం కరిష్యామి భగవాన్‌ ఉమాపుత్ర నమోస్తుతే||
శ్రీ సిద్ధి వినాయకాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి

వస్త్రం
శ్లో|| రక్త వస్త్రద్వయం చారు దేవ యోగ్యంచ మంగళం|
శుభప్రదం గృహాణ త్వం లంబోదర హరాత్మజ||
శ్రీ సిద్ధి వినాయకాయనమః వస్త్ర యుగ్మం సమర్పయామి.

యజ్ఞోపవీతం
శ్లో|| రాజితం బ్రహ్మసూత్రంచ కాంచనం చోత్తరీయకం|
గృహాణ దేవ ధర్మజ్ఞ భక్తానామిష్ట దాయకః||
శ్రీ సిద్థి వినాయకాయనమః యజ్ఞోపవీతం సమర్పయామి.

గంధం
శ్లో|| చందనాగురు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం|
విలేపనం సుర శ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం||
శ్రీ సిద్ధ వినాయకాయనమః గంధం సమర్పయామి.

ధవళాక్షతలు
అక్షతాన్‌ ధవళాకారాన్‌ శాలీ తండుల మిశ్రితాన్‌|
గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే||
శ్రీ సిద్ధి వినాయకాయ నమః అక్షతాన్‌ సమర్పయామి.

పుష్పాలు
సుగంధాని సుపుష్పాణి, జాజీకుంద ముఖానిచ|
ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే||
శ్రీ సిద్థి వినాయకాయ నమః పుష్పం సమర్పయామి

అంగపూజ
ఓం గణేశాయ నమః - పాదౌ పూజయామి
ఓం ఏకదంతాయ నమః - గుల్భౌ పూజయామి
ఓం శూర్పకర్ణాయ నమః - జానునీ పూజయామి
ఓం విఘ్నరాజాయ నమః - జంఘే పూజయామి
ఓం అఖువాహనాయ నమః - ఊరూం పూజయామి
ఓం హేరంబాయ నమః - కటిం పూజయామి
ఓం లంబోదరాయ నమః - ఉదరం పూజయామి
ఓం గణనాధాయ నమః - నాభిం పూజయామి
ఓం గణేశాయ నమః - హృదయం పూజయామి
ఓం స్ధూల కంఠాయ నమః - కంఠం పూజయామి
ఓం స్కందాగ్రజాయనమః - స్కందౌ పూజయామి
ఓం పాశహస్తాయ నమః - హస్తౌ పూజయామి
ఓం గజవక్త్రాయ నమః - వక్త్రం పూజయామి
ఓం శూర్పకర్ణాయ నమః - కర్ణౌ పూజయామి
ఓం ఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామి
ఓం సర్వేశ్వరాయ నమః - శిరం పూజయామి
ఓం విఘ్నరాజాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి
పైవి చదువుతూ అక్షితలనుగాని, పుష్పాలనుగాని వినాయకునిపై వేయాలి.

పత్ర పూజ
సుముఖాయ నమః - మాచీపత్రం పూజయామి
గణాధిపతయే నమః - బృహతీపత్రం పూజయామి
ఉమా పుత్రాయ నమః - బిల్వపత్రం(మారేడు) పూజయామి
గజాననాయ నమః - దుర్వాయుగ్మం (గరిక) పూజయామి
హరసూనవే నమః - దత్తూరపత్రం(ఉమ్మెత్త) పూజయామి
లంబోదరాయ నమః - బదరీపత్రం(రేగు) పూజయామి
గుహాగ్రజయ నమః - అపామార్గపత్రం(ఉత్తరేణి) పూజయామి
గజకర్ణాయ నమః - తులసీపత్రం పూజయామి
ఏకదంతాయ నమః - చూత పత్రం పూజయామి
వికలాయ నమః - కరవీరపత్రం(గన్నేరు) పూజయామి
భిన్న దంతాయ నమః - విష్ణుక్రాంతపత్రం పూజయామి
వటవే నమః - దాడిమీపత్రం(దానిమ్మ) పూజయామి
సర్వేశ్వరాయ నమః - దేవదారుపత్రం పూజయామి
ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి
హేరంబాయ నమః - సింధూవారపత్రం(వావిలి) పూజయామి
శూర్పకర్ణాయ నమః - జాజీపత్రం పూజయామి
సురాగ్రజాయ నమః - గండకీపత్రం పూజయామి
ఇభవక్త్రాయ నమః - శమీపత్రం(జమ్మి) పూజయామి
వినాయకాయ నమః - అశ్వత్థపత్రం(రావి) పూజయామి
సురసేవితాయ నమః - అర్జునపత్రం(తెల్లమద్ది, గన్నేరు) పూజయామి
కపిలాయ నమః - అర్కపత్రం(జిల్లేడు) పూజయామి
శ్రీ సిద్ధి గణాధిపతయే నమః - ఏకవింశతి (21) పత్రాణి పూజయామి

అష్టోత్తర శతనామ(108) పూజ
ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రవేశాయ నమః
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలయ నమః
ఓం మహాబలయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజరరాయ నమః
ఓం హ్రస్వగ్రీవాయ నమః
ఓం మంగళస్వరూపాయ నమః
ఓం ప్రమదాయ నమః
ఓం ప్రధమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం విఘ్నకర్తే నమః
ఓం విఘ్నహంత్రే నమః
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం ప్రాకృతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రితవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బలాయ నమః
ఓం బలోత్థితాయ నమః
ఓం భవాత్మజాయ నమః
ఓం పురాణ పురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః
ఓం పరస్మై నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం సర్వత్రేనే నమః
ఓం సర్వ సిద్ధిప్రదాయ నమః
ఓం సర్వసిద్ధయే నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందానాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః
ఓం అక్షోభ్యాయ నమః
ఓం కుంజరాసుర భంజయనాయ నమః
ఓం ప్రమోదాత్తాయ నమః
ఓం మోదక ప్రియాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతయే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థపవన ప్రియాయ నమః
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం విష్ణు ప్రియాయ నమః
ఓం భక్త జీవితాయ నమః
ఓం జితమన్మధాయ నమః
ఓం ఐశ్వర్య కారణాయ నమః
ఓం జాయసే నమః
ఓం యక్ష కిన్నర సేవితాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం గణాధీశాయ నమః
ఓం గంభీరనినదాయ నమః
ఓం వటవే నమః
ఓం అభీష్ట వరదాయ నమః
ఓం జ్యోతిషే నమః
ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం భక్తనిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం మంగళప్రదాయ నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం అప్రాకృత పరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః
ఓం సఖ్యై నమః
ఓం సరసాంబునిధయే నమః
ఓం మహేశాయ నమః
ఓం దివ్యాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖలాయ నమః
ఓం సమస్త దేవతా మూర్తయే నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మ రూపిణే నమః
ఓం బ్రహ్మ విద్యాదానభువే నమః
ఓం జిష్ణవే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విఘాత కారిణే నమః
ఓం విస్వదృశే నమః
ఓం విశ్వరక్షాకృతే నమః
ఓం కళ్యాణగురవే నమః
ఓం ఉన్మత్త వేషాయ నమః
ఓం అపరజితయే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్వైశ్వర్య ప్రదాయ నమః
ఓం ఆక్రాంత చిదచిత్రభవే నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః
నానావిధ పరిమళ పత్రపుష్పాక్షితైః పూజాం సమర్పయామి

ధూపం
శ్లో|| దశాంగం గుగ్గిలోపేతం సుగంధం సుమనోహరం
ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ
శ్రీ సిద్ధివినాయకాయ నమః ధూప మాఘ్రాపయామి

దీపదర్శనం
శ్లో|| సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
గృహాణ మంగళం దీపం ఉమాపుత్ర నమోస్తుతే
శ్రీ సిద్ధి వినాయకాయనమః దీపం దర్శయామి.

నైవేద్యం
శ్లో|| శ్రీ గంధాః సుకృతాన్‌ చైవ మోదకాన్‌ ఘృతపాచితాన్‌
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్త్గెః ప్రకల్పితాన్‌||
భక్ష్యం భోజ్యంచ లేహ్యంచ చోష్యంచ పానీయ మేవచ
ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక,
శ్రీ సిద్ధి వినాయకాయ నమః నైవేద్యం సమర్పయామి.

తాంబూలం
శ్లో|| పూగీఫలం సంయుక్తం నాగవల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతాం
శ్రీ సిద్ధి వినాయకాయ నమః తాంబూలం సమర్పయామి.

నీరాజనం
శ్లో|| మంగళం సుముఖోదేవ మంగళం అఖువాహన
మంగళం విఘ్నరాజాయ, మంగళం స్కంద పూర్వజః||
శ్రీ సిద్ధి వినాయకాయ నమః ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి
వక్రతుండ-మహాకాయ! కోటి సూర్య సమప్రభ
అవిఘ్నం కురుమే దేవ! సర్వకార్యేషు సర్వదా||

మంత్ర పుష్పం
శ్లో|| సచ్చిదానంద విఘ్నేశ పుష్కలాని ధనానిచ
భూమ్యాం స్థితాని భగవాన్‌ స్వీకురుష్వ వినాయక.
శ్రీ సిద్ధి వినాయకాయనమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి
ఇప్పుడు చేతిలోనికి అక్షతలు తీసుకుని వినాయకవ్రత కధను చెప్పుకోవాలి

వినాయక వ్రత కధా ప్రారంభం
సూత మహాముని శౌనకాది మహామునులకు విఘ్నేశ్వరోత్పత్తియను, చంద్ర దర్శన దోష నివారణంబును చెప్ప నారంభించెను.
పూర్వ కాలమందు గజాసురుడు అను రాక్షసుడు శివుని గూర్చి గొప్ప తపస్సు చేశాడు. అతని తపః ప్రభావంతో పరమశివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి 'నీవు ఎల్లప్పుడు నా ఉదరంలో నివసించాలి' అని కోరుకున్నాడు. శివుడు అతని కోరిక తీర్చేందుకు గజాసురుని ఉదరంలో ప్రవేశించాడు. అప్పుడు కైలాసంలో ఉన్న నంది, భృంగి, వీర భద్రాదులు, ప్రమధ గణాలకు ఈశ్వరదర్శనం లభించకపోవడంతో ఈశ్వరుడి భార్య ఐన పార్వతి వద్దకు వెళ్ళారు. దీంతో పార్వతి భర్తజాడ తెలియక చింతించింది. కొంతసేపటి తర్వాత పార్వతి ప్రమధగణాలతో కలసి విష్ణుమూర్తి వద్దకు వచ్చింది. అప్పుడు విష్ణుమూర్తి పార్వతీదేవి బాధను నివారించడానికి శివుని వెదకుతూ చివరకు శివుడు గజాసురుని గర్భంలో ఉన్నట్లు తెలుసుకుని, గజాసురిడి గర్భంనుంచి పరమేశ్వరుడిని బయటకు రప్పించడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. శివుని వాహనమైన నంది'ని అలంకరించి బహ్మ, తదితర దేవతలతో కలసి రకరకాల వేషాలతో గజాసురుని పురానికి వెళ్ళారు. అప్పుడు ఆ పట్టణంలో నందిచేత నాట్యం చేయిస్తుండగా గజాసురుడు వారిని తనవద్దకు పిలిపించాడు. అక్కడవారు పలు విధాలుగా, నందిచేత నాట్యం చేయించగా, గజాసురుడు ఆనాట్యాన్ని చూసి గొప్ప ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని పొందాడు. బ్రహ్మ, విష్ణువులు మారువేషాల్లో ఉన్నట్లు గుర్తించలేక వారితో 'మీకేం వరం కావాలో' కోరుకోమన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి ఈ నంది ఈశ్వరుని వాహనమని తెలిపి, అతని గర్భంలో ఉన్న మహేశ్వరుడిని తమకు అప్పగించాలని కోరారు. అప్పుడు గజాసురుడికి ఆ నందితో ఉన్న వారంతా బ్రహ్మ, విష్ణు తదితర దేవతలని తెలుసుకున్నాడు. దీంతో ఇక తనకు చావు తప్పదని నిర్ధారించుకున్నాడు. అందుకే తన ముఖానికి శాశ్వతత్వాన్ని ప్రసాదించమని దేవతలను కోరాడు. అప్పుడు దేవతలు గజాసురుని సంహరించడానికి నందిని ప్రేరేపించారు. అప్పుడు నందిని తన కొమ్ములతో గజాసురుని వక్షస్థలాన్ని చీల్చి, అతన్ని సంహరించింది. అప్పుడు ఈశ్వరుడు గజాసురుని నుంచి బయటకొచ్చాడు. ఆతర్వాత విష్ణుమూర్తి వైకుంఠానికి, బ్రహ్మ సత్యలోకానికి, మిగిలిన దేవతలు వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారు. ఈశ్వరుడు గజాసురుని శిరస్సును చేతితో పట్టుకుని, కైలాసానికి బయల్దేరాడు.

వినాయకావిర్భావం
కైలాసంలో ఉన్న పార్వతీదేవి తన భర్త అయిన ఈశ్వరుడు గజాసురుడి నుంచి బయటపడి కైలాసానికి వస్తున్నట్లుగా తెలుసుకుంది. ఎంతగానో సంతోషించింది. అభ్యంగన స్నానం చేయడానికి వెళుతూ నలుగు పిండితో ఒక బాలుడి బొమ్మను చేసి, ప్రాణం పోసి, వాకిలి వద్ద కాపలా ఉంచి, స్నానానికి వెళ్ళింది. ఆ సమయంలో గజాసురుని ముఖాన్ని చేత్తో పట్టుకుని శివుడు వెండి కొండ వద్దకు వచ్చాడు. వాకిలి దగ్గర కాపలాగా ఉన్న బాలుడు శివుని అడ్డగించాడు. తీవ్రమైన కోపంతో శివుడు ఆ బాలుడిని సంహరించి, లోపలికి వెళ్ళాడు. ఆతర్వాత పార్వతీ దేవి తలంటు స్నానం చేసి, సర్వాభరణ భూషితురాలై భర్త అయిన ఈశ్వరుడి వద్దకు వచ్చి సంతోషంతో మాట్లాడింది. వారి మాటల సమయంలో శివుడు వాకిట్లో తనను అడ్డగించిన బాలుని తాను సంహరించినట్లు చెప్పాడు. బాలుడి మరణవార్త విని, పార్వతి దుఃఖిస్తుండగా ఈశ్వరుడు పార్వతిని ఓదార్చి తాను తెచ్చిన గజాసురుని ముఖాన్ని బాలుడి మొండేనికి అతికించి ప్రాణం పోశాడు. పార్వతి ఎంతగానో సంతోషించింది. ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు ఆ బాలుడిని కుమారుడిగా స్వీకరించి, అతనికి ఎలుకను వాహనంగా ఇచ్చి సుఖంగా సంచరించమని దీవించారు. కొంతకాలానికి వారికి కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి దేవతలకు సేనానాయకుడై విరాజిల్లాడు.
ఒకనాడు దేవతలు, మునులు, పరమేశ్వరుని దర్శించి, విఘ్నాలకు ఒకరిని అధిపతిగా చేయమని కోరారు. గజాననుడు మరుగుజ్జువాడు, అసమర్థుడు కనుక ఆ ఆధిపత్యాన్ని తనకు ఇవ్వమని, కుమారస్వామి తండ్రిని వేడుకొన్నాడు. అప్పుడు శివుడు 'మీ ఇద్దరిలో ఎవరు ముల్లోకాల్లోని పుణ్యనదులలో స్నానం చేసి, ముందుగా నావద్దకు వస్తారో వారికి ఆధిపత్యాన్ని ఇస్తా'నని చెప్పాడు. కుమారస్వామి వెంటనే తనవాహనమైన నెమలినెక్కి అతివేగంగా సంచరిస్తున్నాడు. అప్పుడు గజాననుడు ఖిన్నుడై తండ్రివద్దకు వచ్చి, నమస్కరించి 'ఓ తండ్రీ నా అసమర్థత తెలిసి కూడా ఇలాంటి అసాధ్యమైన పరీక్షను పెట్టారు కాబట్టి దానికి తగిన ఉపాయాన్ని కూడా చెప్పండని ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు గజాననుడు ఆశీర్వదిస్తూ తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసినవాడు భూమండలానికి ప్రదక్షిణం చేసినంత ఫలితాన్ని పొందుతాడని, అలా చేయమని సూచించాడు. మూడు కోట్ల యాభై లక్షల నదులలో స్నానం చేసి, వస్తున్న కుమారస్వామికి ప్రతిచోటా తనకంటే ముందుగా స్నానం చేసివెళ్తున్న గజాననుడు కనిపించాడు. కుమారస్వామి తన ఓటమిని అంగీకరించి, తండ్రివద్దకు వచ్చి అన్నగారికే విఘ్న ఆధిపత్యాన్ని ఇవ్వాలని కోరాడు. అప్పుడు పరమేశ్వరుడు గజాననుడికి విఘ్న నాయకుడిగా ఆధిపత్యాన్నిచ్చాడు. ఆనాడు భాద్రపద శుద్ధచవితి. ఆనాడు వినాయకునికి కుడుములు, ఉండ్రాళ్ళు ఇచ్చి పూజించిన జనాలకు అన్ని విఘ్నాలు తొలగిపోతాయని శివుడు వరమిచ్చాడు. భక్తులిచ్చిన కుడుములు ఉండ్రాళ్ళు తిని, కైలాసానికి వచ్చి తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేస్తూ శ్రమపడుతున్న విఘ్నేశ్వరుని చూసి, చంద్రుడు వికటంగా నవ్వాడు. చంద్రుని దృష్టితగిలి వినాయకుని ఉదరం పగిలింది. మరణించిన విఘ్నేశ్వరుని చూసి పార్వతి దుఃఖించి 'నిన్నుచూసిన జనులు పాపాత్ములై నిందలు పొందుదురు గాక' అని శపించింది.

రుషి పత్నులకు నీలాపనిందలు కలుగుట
పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తర్షులు భార్యలతోకలసి, యజ్ఞం చేస్తూ అగ్ని దేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు రుషి పత్నుల మీద మోహం పొంది, శాపభయంతో క్షీణింపసాగాడు. అగ్ని దేవుని భార్య అయిన స్వాహాదేవి, తానే రుషిపత్నుల రూపాలను పొంది అగ్నిదేవుడిని చేరింది. రుషులు అగ్ని దేవునితో ఉన్నది తమ భర్యలేనని భ్రాంతిచెంది, వారిని విడిచిపెట్టారు. పార్వతి శాపంవల్ల రుషిపత్నులు చంద్రుని చూట్టం వల్ల అపనిందను పొందారని, దేవతలు తెలుసుకుని, బ్రహ్మదేవునితో కలసి, కైలాసానికి వెళ్లారు. బ్రహ్మదేవుడు మరణించి, పడివున్న విఘ్నేశ్వరుడిని తిరిగి బతికించాడు. తర్వాత పార్వతిదేవితో 'అమ్మా నీవు చంద్రునికిచ్చిన శాపం వల్ల ఆపద కలిగినది కాబట్టి దాన్ని ఉపసంహరించ'మని కోరాడు. అప్పుడు పార్వతీదేవి తిరిగి బతికిన తన కుమారుడిని ప్రేమతో దగ్గరకు తీసుకుని, 'ఏరోజున విఘ్నేశ్వరుడిని చూసి చంద్రుడు నవ్వాడో ఆరోజు చంద్రుని చూడకూడదని శాపాన్ని సవరించింది. అప్పటినుంచి అందరూ భాద్రపద శుద్ధచవితినాడు చంద్రుని చూడకుండా జాగ్రత్తతో ఉండి, సుఖంగా ఉన్నారు. ఈ విధంగా కొంతకాలం గడిచింది.

శమంతకోపాఖ్యానం
ద్వాపరయుగంలో ద్వారక నివాసి అయిన శ్రీకృష్ణుడిని నారదుడు దర్శించి ప్రియసంభాషణల జరుపుతూ 'స్వామీ! ఈ రోజు వినాయకచవితి కనుక పార్వతి శాపం కారణంగా చంద్రుడిని చూడకూడదు, కనుక నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి, నారదుడు స్వర్గలోకానికి వెళ్ళాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ రోజు రాత్రి చంద్రుడిని ఎవరూ చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు. ఆనాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీర ప్రియుడు కావడంచేత ఆకాశం వంక చూడకుండానే, ఆవుపాలను పితుకుతూ పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దీంతో నాకెలాంటి అపనింద రానుందోనని చింతించాడు. కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్యుడి వరంచేత శమంతకమణిని సంపాదించి, ద్వారకకు శ్రీకృష్ణుని చూడడానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు మర్యాద చేసి ఆ మణిని తనికిమ్మని అడిగాడు. అప్పుడు సత్రాజిత్తు ఇదిరోజుకి ఎనిమిది బారువుల బంగారాన్ని ఇస్తుందని, అలాంటి దీన్ని ఏ మందమతి కూడా మరొకరికి ఇవ్వడని పలికి కృష్ణుని కోరికను తిరస్కరించాడు. తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతక మణిని మెడలో ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళాడు. అప్పుడు ఒక సింహం ఆ మణిని చూసి మాంసఖండమని భ్రమించి, వానిని చంపి ఆ మణిని తీసుకొని పోతుండగా ఒక ఎలుగుబంటు (జాంబవంతుడు) ఆ సింహాన్ని చంపి, ఆ శమంతక మణిని తన కొండగుహలో ఉన్న తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరునాడు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్తను విని శ్రీకృష్ణుడు మణిని ఇవ్వలేదని తన సోదరుడిని చంపి రత్నాన్ని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అదివిని ఆ రోజు (భాద్రపద శుద్ధ చవితి) చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తనమీద నింద పడిందని గ్రహించాడు. శమంతక మణిని వెదకుతూ అడవికి వెళ్లగా ఒకచోట ప్రసేనుని మృత శరీరాన్ని చూశాడు. అక్కడ సింహపు అడుగు జాడలు ఆయనకు కనిపించాయి. ప్రసేనుడు సింహం వల్ల మరణించాడని శ్రీకృష్ణుడు గ్రహించాడు. ఆతర్వాత భల్లూక చరణ విన్యాసం కనిపించింది. దాన్ని అనుసరించి వెళ్ళి ఒక పర్వతగుహలోకి శ్రీకృష్ణుడు ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టినమణిని చూసి, దానిని తీసుకుని, బయటకు రాసాగాడు. అక్కడున్న బాలిక ఏడ్వసాగింది. అంత దాది ఎవరో వచ్చారని కేకపెట్టింది. అప్పుడు జాంబవంతుడు మిక్కిలి కోపంతో శ్రీకృష్ణునిపైబడి అరుస్తూ అతనితో యుద్ధానికి దిగాడు. వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులుయుద్ధం జరిగింది. జాంబవంతుడి శక్తి క్షీణించింది. తనతో ద్వంద్వ యుద్ద చేసినవాడు రావణాసురిని చంపిన శ్రీరామచంద్రునిగా తెలుసుకున్నాడు. ఆశ్రీరాముడే ఈ శ్రీకృష్ణుడని గ్రహించాడు. తాను త్రేతాయుగంలో శ్రీరాముని కోరిన కోర్కెను శ్రీకృష్ణుడు తనతో యుద్ధం చేసి, తీర్చుకున్నాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి, శమంతకమణితోపాటు తన కుమార్తె అయిన జాంబవతినికూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు శమంతకమణిని సత్రాజిత్తునకు ఇచ్చాడు. సత్రాజిత్తు జరిగిన యధార్థాన్ని తెలుసుకొని తన తప్పు మన్నించమని శ్రీకృష్ణుని ప్రార్థించి, తన కుమార్తె అయిన సత్యభామను, కృష్ణునికిచ్చి వైభవంగా వివాహంచేసి, శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి సమర్పించాడు. ఆసమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడ్ని ప్రార్థించి మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మావంటి వారికి ఏది గతి? అని ప్రార్థింపగా శ్రీకృష్ణుడు దయామయుడై భాద్రపద శుద్ధ చవితినాడు యధావిధిగా వినాయకుని పూజించి ఈ 'శమంతకోపాఖ్యానాన్ని' విని అక్షతలు తలపై ధరించిన వారికి ఆ నాడు ప్రమాదవశాత్తు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలుగవు అని పలికాడు. అనాటి నుండి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్దచవితినాడు దేవతలు, మహర్షులు, మానవులు తమ తమ శక్తికి తగ్గినట్లుగా గణపతిని పూజించి తాముకోరిన కోరికలు తీర్చుకొన్నారు.
ఈ కధను చదివి గాని, వినిగాని తలపై అక్షతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి.
ఆ తర్వాత శక్తి తగ్గట్లుగా వినాయకుడికి సంబంధించిన దండకాన్ని, స్తోత్రాలను, పద్యాలను చదువుకోవాలి. చివరిగా వినాయకుని ఎదుట చేతనైనన్ని గుంజీలు తీసి సాష్ఠాంగ దండ ప్రణామం చేయాలి.

వినాయక దండకం
శ్రీ పార్వతీ పుత్రలోకత్రయ స్తోత్ర సత్పుణ్య చారిత్ర భద్రేభ వక్త్రా మహాకాత్యాయినీ సంజత స్వామీ శివా సిద్ధివిఘ్నేశ నీ పాదపద్మంబులన్‌ నీదు కంఠంబు నీబొజ్జ నీమోము నీమౌళి బాలేందు ఖండంబు నీ నాల్గు హస్తంబులు నీ కరాళంబు నీ పెద్ద వక్త్రంబు దంతంబు నీ పాదహస్తంబు లంబోదరంబున్‌ సదా మూషి కాస్యంబు నీ మందహాసంబు నీ చిన్న తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగయజ్ఞోపవీతంబు నీ భవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీత మ్రొక్కంగ శ్రీ గంధముంన్‌ కుంకుమాక్షతలు జాజులున్‌, పంకజంబులన్‌ తగన్‌ మల్లెలు న్మొల్లలు మంచి చేమంతులున్‌ దెల్లగన్నేరులున్‌ మంకెనల్‌ పొన్నలున్‌ పువ్వులున్‌ మంచి దూర్వంబులున్దెచ్చి శాస్త్రోక్తరీతిన్‌ సమర్పించి పూజించి సాష్టాంగముంజేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయ పొన్నంటి పండ్లున్‌ మరన్మంచివౌ నిక్షు ఖండంబులు న్రేగుబండ్లప్పడంబుల్‌ వడల్‌ నేయి బూరెల్‌ మరిన్‌ గోధమప్పంబులున్‌ పున్గులున్బూరెలున్‌ న్గారెలున్‌ చొక్కమౌ చల్మిడిన్‌ బెల్లమున్‌ తేనెయుం జున్నుబాలాజ్యమున్నానుబియ్యంబు నామ్రంబుబిల్వంబు మేల్‌ బంగారు బళ్ళెగ్గాందుంచి నైవేద్యముంజేసి నీరాజంనంబున్‌ నమస్కారముల్‌ జేసి విఘ్నేశ్వరా నిన్ను బూజింపకే యన్య దైవంబులన్‌ బ్రార్థనల్‌ సేయుటల్‌ కాంచనం బొల్లకే ఇన్ముదా గోరు చందంబుగాదే మహాదేవ యోభక్త మందార యో సుందరాకార యో భగ్య గంభీర యో దేవచూడామణి లోక రక్షామణీ బంధు చింతామణీ స్వామీనిన్నెంచ నేనెంత నీదాస దాసానుదాసుండ నన్నెపుడు చేబట్టి సుశ్రేయునింజేసి శ్రీమంతుగా జూచి హృత్పద్మ సింహాసనా రూఢ తన్నిల్పి కాపాడుటేకాదు నినుగొల్చి ప్రార్థించు భక్తాళికిన్‌ కొంగుబంగారమై కంటికిన్‌ ఱెప్పవై బుద్దియున్విద్యదయు న్బాడియున్‌ పంటయున్‌ బుత్రపౌత్రాభివృద్ధిన్‌ దగన్‌ కల్గగా జేసి పోషింపుమంటిన్‌ నమస్తే నమస్తే నమః

.... ఓమ్‌ తత్సత్‌ ....
డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు

No comments:

Post a Comment