బి అంటే బ్లాగు
ఈ-కాలం చిత్రమైంది సుమీ! ఎంతలో ఎంత మార్పు? వెున్నటిదాకా మెయిల్ ఐడీ సృష్టించుకోవడమే గొప్ప. నిన్నంతా వెబ్‌సైట్ జపం. ఇవ్వాళ, 'హేయ్ నీ బ్లాగ్ అడ్రస్ ఏంటి యార్?' అని సంభాషణలు. ఇంటి అడ్రస్ తప్ప మరో చిరునామా తెలియనివాళ్లు వెర్రిముఖాలేసినా, 'ఇప్పుడదో వెర్రి కాబోలు' అని 'చాదస్తపు' మనుషులు నొసలు చిట్లించినా... ఆధునిక రచ్చబండగా వర్ధిల్లుతోంది బ్లాగు. ఉబుసుపోని కబుర్ల నుంచి వూహాలోకాన్ని ఆవిష్కరించే కలలదాకా అన్నీ అక్కడ 'మాట్లాడుకోవచ్చు', పదాలతో పోట్లాడుకోవచ్చు. ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికీ తుంటరితనాన్ని ప్రదర్శించుకోవడానికీ చెప్పుకోదగినవి చెప్పుకుని ఆనందాన్ని పెంచుకోవడానికీ చెప్పుకోలేనివి చెప్పుకుని దుఃఖాన్ని పంచుకోవడానికీ ఇదే వేదిక. ఒక్క మాటలో ఇది మీ పక్కవాళ్లను చదవడానికి అనుమతిచ్చే మీ ఆన్‌లైన్ డైరీ.
ఆమాటంటే ఒప్పుకోడుగానీ ఆనంద్ అందరిలాంటివాడే. ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అభిమాన హీరో సినిమా వెుదటి రోజు, వెుదటి ఆట చూసేశాడు. టికెట్ బ్లాకులో కొన్నాడా? రెకమెండేషన్లతో సంపాదించాడా? అప్రస్తుతం. వెుత్తానికి చూశాడు. సినిమా ఏ కోశానా నచ్చలేదు. డబ్బు, శ్రమ, సమయం... మూడు నష్టపోయాడు. 'మూడ్' ఆఫ్ అయింది. మ్యాట్నీకి పొలోమంటూ వస్తున్న జనాన్ని చూసి, 'ఈ సినిమా బాగాలేదు' అని అరవాలనిపించింది. అరవలేముగా! మర్యాదస్థులం కదా. కానీ 'బాగాలేదు' అని చెప్పెయ్యాలి. లేదంటే కడుపు ఉబ్బు తగ్గదు. సీరియస్‌గా ఇంటర్‌నెట్ కెఫేకు వెళ్లాడు. అంతకంటే సీరియస్‌గా తన బ్లాగులో టైపు చేయడం వెుదలుపెట్టాడు. అక్షరాలు ఎగదన్నుకొచ్చినై. స్క్రీన్‌ప్లేలో లోపం ఏమిటో, నటన ఎంత చెత్తగా ఉందో... ఇంకో రహస్యం.. అది ఏ హాలీవుడ్ సినిమాకు కాపీయో కూడా రాసేశాడు. హేపీ!
ఇప్పుడు ఆనంద్ సమీక్షకు 'వెయిట్' ఉంది. ఆ సినిమా చూద్దామని 'వెయిట్' చేస్తున్నవాళ్లను ఆపగలిగాడు మరి. అతి కొద్దిమందినే కావొచ్చు, కానీ దాని ప్రభావం ఉండడం గొప్ప విషయం కదా! ఆ కిక్కే ఆనంద్‌ను 'బ్లాగర్'గా కొనసాగేలా చేస్తోంది. ఐటీ పరిశోధన, సలహా సంస్థ 'గార్ట్‌నర్' అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు పదికోట్ల బ్లాగుల్లో ఆనంద్‌ది ఒకటని వేరే చెప్పక్కర్లేదు కదా!
వ్యక్తిగత వెబ్‌సైట్
బ్లాగ్... పూర్తిగా చెప్పాలంటే వెబ్‌లాగ్ (weblog)... దీన్నే విడదీసి 1999లో పీటర్ మెర్హోల్జ్ అనే బ్లాగర్ చమత్కారంగా 'వి బ్లాగ్' అన్నాడు. శ్రీనివాస్‌లోంచి విరిచిన శ్రీను పలకడానికి చక్కగా ఉండి, జనావోదం పొందినట్టే బ్లాగు కూడా వాడుకలోకి వచ్చింది. నామవాచకంగానూ క్రియగానూ చలామణీ అవుతోంది. భాషంటే జనావోదమేగా! ఇక వెబ్‌సైట్ అన్నా వెబ్‌లాగ్ అన్నా దాదాపుగా ఒకటే. తేడా అల్లా వెుదటిది అచ్చువేసిన పుస్తకమైతే, రెండోది నోట్‌బుక్కు లాంటిది. ఆ నోట్సులో ఏమైనా రాసుకోవచ్చు.
సినిమా సమీక్ష, పుస్తక సమీక్ష, ఆరోగ్య సూత్రాలు, పర్యావరణ మంత్రాలు, మీ మీద, మీ స్నేహితుల మీద, మీ బాసు మీద(జాగ్రత్త! వాళ్ల దృష్టిలో పడి, ఉద్యోగాలు ఊడిపోయిన కేసులున్నాయి), చెట్ల మీద, గట్ల మీద... మీ కుక్కకు ఏం పేరు పెట్టారు... ఎందుకు పెట్టారు... ఏమైనా రాయెుచ్చు. ఇంకా మీరు పేర్చుకున్న కవితలు ఏ సంపాదకుడికో పంపక్కర్లేదు, కాణీ ఖర్చు లేకుండా అచ్చువేసుకోవడమే. అయితే, చెప్పేవాడికి వినేవాడు లోకువ అనుకోకుండా... ఎదుటివారితో పంచుకుంటే విలువ పెరిగేవైతే మంచిది. అప్పుడే మీ బ్లాగు 'హిట్' అవుతుంది. మీకు పేరొస్తుంది.
ఎందుకీ ఆకర్షణ?
దేన్నీ తేల్చకుండా నసిగితే మెచ్చే రకం కాదు ఇప్పటితరం. ఏ వెుహమాటాలు ఉండవు కాబట్టి, ధైర్యంగా వాతపెట్టేలా రాసుకోవచ్చు. అది రాజకీయాభిప్రాయం కానీ మరేదైనా కానీ. ప్రధానస్రవంతి ప్రసారమాధ్యమాలకు లేని సౌలభ్యం ఇది. అందుకే బ్లాగుమంత్రం విశ్వవ్యాప్తమైంది. కళాశాల విద్యార్థుల నుంచి కార్పొరేట్ సీఈఓల దాకా బ్లాగులు సృష్టించుకునేలా చేస్తోంది. దర్శకుడు శేఖర్‌కపూర్, సీనియర్ జర్నలిస్ట్ సాగరికా ఘోష్‌లాంటివారు నిత్య బ్లాగరులే. అమెరికా సామ్రాజ్యవాదం నుంచి నైజీరియా ఆకలిచావుల దాకా, బుద్ధుడి బోధనల నుంచి గ్లోబల్‌వార్మింగ్‌దాకా అన్నీ ఇందులో చర్చనీయాంశాలే. 'స్త్టెల్‌షీట్‌ను ఫాలో కావాలి, పదాల లెక్కలు పాటించాలి అన్న సమస్యలేదు. కావాల్సినంత స్వేచ్ఛగా రాసుకోవచ్చు' అంటాడు ముంబయి జర్నలిస్టు అమిత్‌వర్మ. బ్లాగుల్లో మరో సానుకూలాంశం ఫీడ్‌బ్యాక్. మనం రాసిందానికి వెంటనే స్పందన వస్తుంది. నచ్చనీ నచ్చకపోనీ... కొందరు దాన్ని చదివారు, మనం ప్రస్తావించిన అంశం గురించి ఆలోచించారు అన్న తృప్తి మిగులుతుంది.
ఇది బ్లాగులు ఉన్నవారి విషయం. లేనివారి సంగతి?
పాల్గొనే అవకాశం
బ్లాగింగ్ చేయడమంటే రాయాలనే కాదు. అందరూ రాసుకుంటూ పోతే చదివేదెవరు? ట్రావెల్ బ్లాగ్, పొలిటికల్ బ్లాగ్, ఫ్యాషన్ బ్లాగ్, లీగల్ బ్లాగ్, కార్పొరేట్ బ్లాగ్, కన్ఫెషన్ బ్లాగ్, అడల్ట్ బ్లాగ్... ఎన్నో రకాలు. అంశాన్ని బట్టి బ్లాగులను ఎంపిక చేసుకోవడానికి టెక్నోరాటి, బ్లాగ్‌డిగ్గర్, ఫీడ్‌స్టెర్‌లాంటి సెర్చ్ ఇంజిన్స్ మనకు దోహదం చేస్తాయి.
చదివిన అంశాలమీద నిర్మొహమాటంగా మన అభిప్రాయం చెప్పొచ్చు. ఖండిస్తామా పొగుడుతామా మన ఇష్టం. మైస్పేస్, ఫేస్‌బుక్, టైప్‌ప్యాడ్, ఆర్కుట్, యూట్యూబ్, ఫ్లికర్, మమ్స్‌నెట్, కేర్2 లాంటి వెబ్‌సైట్లు ఆదరణ పొందడానికి కారణం నెటిజన్లు పాల్గొనే అవకాశం ఇవ్వడమే. అందుకే ఇంతకుముందు సాధారణ వెబ్‌సైట్లుగా ఉన్న రాయిటర్స్, బీబీసీ, గార్డియన్‌లాంటివీ బ్లాగింగ్‌కు అవకాశం కల్పిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, సన్, ఇంటెల్ లాంటి సంస్థలు వినియోగదారుల స్పందన కోసం బ్లాగులను ఏర్పాటుచేసుకున్నాయి. వెబ్‌సైట్ నిర్మాణంతో పోల్చితే దీనికయ్యే ఖర్చు చాలా తక్కువ కావడం మరో లాభం. ఇంకో అమూల్యమైన ప్రయోజనం ఉందని గుర్తుచేస్తాడు, రోజుకు అరగంటైనా బ్లాగు చెయ్యకుండా నిద్రపోని ఎంసీఏ పవన్... 'కాగితం అక్కర్లేని సమాచార ప్రపంచం. చెట్లను కొట్టాల్సిన పనిలేని భావప్రసారం'.
కాసులు తెచ్చే కళ
ఎక్స్‌ప్రెస్ యువర్‌సెల్ఫ్... అంటుంది ఓ సెల్‌ఫోన్ ప్రకటన. బ్లాగు కూడా మిమ్మల్ని మీరు వ్యక్తపరుచుకోవడమే. ఇదే మిమ్మల్ని సెలబ్రిటీ చేయెుచ్చు. మీకు కాసులు కురిపించొచ్చు. కొన్నాళ్ల క్రితం అమిత్ అగర్వాల్ ఓ బ్లాగు ప్రారంభించాడు. వెుబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ప్రింటర్ల మీద ఆయన ఇస్తున్న సూచనలు ఎందరినో ఆకర్షించాయి. అతడి labnol.blogspot.com పాపులర్ అయింది. హిట్స్ పెరిగాయి. కంపెనీలు ఇందులో ప్రకటనలు ఇచ్చేందుకు ఆసక్తి చూపాయి. ఇంకేం? అమిత్ హైదరాబాద్‌లో ఉద్యోగం మానేసి సొంతనగరం ఆగ్రా వెళ్లిపోయాడు. ప్రస్తుతం... బ్లాగింగ్ అతడి ఫుల్‌టైమ్ జాబ్. చెన్నైకి చెందిన గణేశ్ షేర్‌మార్కెట్ మీద సలహాలు, సూచనలతో వెుదలుపెట్టిన www.rupya.comలో బ్యాంకులు ప్రకటనలు ఇస్తున్నాయి. అంతర్జాతీయంగా కూడా కొన్ని సంస్థలు పేరువోసిన బ్లాగర్లను కన్సల్టెంట్లుగా నియమించుకున్న ఉదాహరణలున్నాయి. దీనికి వాళ్ల పెట్టుబడి... కొంత సమయం. డబ్బు మాత్రం కాదు.
టీవీ ఛానళ్లు ఉచితంగా ప్రసారాలు చేస్తూ, వ్యాపార ప్రకటనలు రాబట్టినట్టే ఇక్కడ కూడా. ప్రజాదరణ పొందేట్టు చూసుకోవడమే మన ప్రతిభ. బ్లాగులద్వారా డబ్బులు ఎలా సంపాదించాలో చెప్పే బ్లాగులు కూడా ఉన్నాయి.
'ఇంటర్‌నెట్ అండ్ వెుబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా' అంచనా ప్రకారం గతేడాది మనదేశంలో ఆన్‌లైన్ వ్యాపార ప్రకటనల పెట్టుబడి రూ.218 కోట్లు. 2012 నాటికి ఇది రూ.2,200 కోట్లకు పెరగనుంది. ఇంటర్నెట్ వాడకందార్ల సంఖ్య ప్రస్తుత 4 కోట్ల నుంచి 2008 నాటికి 10 కోట్లకు పెరుగుతుంది.
చెడుకున్నంత అయస్కాంత శక్తి మంచికి లేదు. ఏదోలా తమ బ్లాగు నలుగురి దృష్టిలో పడాలన్న ఆరాటం కొంతా, ఏ నియంత్రణా లేని సమాచార విప్లవ విశృంఖల స్వేచ్ఛ మరికొంతా... వెరసి బ్లాగుల్లో కాలుష్యం పెరుగుతోంది. వర్ణాహంకార రాతలు, మత వైరాన్ని ప్రోత్సహించే కూతలు, వ్యక్తిగత దూషణలు, దేశాలతో నిమిత్తం లేకుండా సెక్సుబొమ్మలు... పునఃపరిశీలన ఉండదు కాబట్టి అందులో ఇచ్చే సమాచారంలో వాస్తవమెంత అనేది ఎప్పుడూ సమస్యే. బ్లాగర్లు కాపీరైట్ హక్కులను ఉల్లంఘిస్తున్నారనీ సంయమనం ఎంతమాత్రం పాటించట్లేదనీ ఉన్న విమర్శలు లెక్కకు మిక్కిలి.
రచయిత అండ్రూ కీన్ అయితే 'కోట్లాది కోతులు, కోట్లాది టైప్‌రైటర్ల మీద చేస్తున్న విన్యాసం'గా బ్లాగింగును అభివర్ణించాడు. ఈ పిల్ల చేష్టలమీద 'ద కల్ట్ ఆఫ్ అమెచ్యూర్' అనే పుస్తకం కూడా రాశాడు.
ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలన్నట్టు, వాళ్లు వెతుకుతున్న బ్లాగులను బట్టి 'నేటిజన్ను'(నేటి నెటిజన్) అంచనా వేయాలి. కత్తిపీటతో కుత్తుక కోయెుచ్చు, కూరగాయలు తరిగి పిల్లలకు వంటచేసి పెట్టొచ్చు... ఎవరి విచక్షణ, సంస్కారం వారిది!
ఒకటి మాత్రం నిజం. ఉత్తరాలు పోస్టు చేయడం మరిచిపోయిన నేటితరాన్ని మళ్లీ 'పోస్టింగు' చేయిస్తోంది బ్లాగు. 2006లో టైమ్ పత్రిక మ్యాన్ ఆఫ్ ద ఇయర్‌గా 'నువ్వు'(యు) ఎంపిక కావడానికి కారణం బ్లాగులే. వాటిల్లో చోటుచేసుకున్న అర్థవంతమైన చర్చలే, భూగోళాన్ని మరింత బాగా తీర్చిదిద్దుకోవడానికి స్ఫూర్తిదాయకమైన సూచనలే.
'ఐ థింక్, దేర్‌ఫోర్ ఐ యామ్' అంటాడు ఫ్రెంచ్ తత్వవేత్త రెనీ డెస్కార్టెస్.
ఈ సుప్రసిద్ధ తాత్విక భావనను కొద్దిగా మార్చి రాసుకుంటే... ఐ రైట్, దేర్‌ఫోర్ ఐ యామ్... ఇదే ఇప్పటి యువతకు పరిచయవాక్యం, బ్లాగుల వ్యాసానికి భరతవాక్యం.
* రెండేళ్ల క్రితం బ్లాగులో కార్పొరేట్ రహస్యాలు చర్చించినందుకుగానూ గూగుల్ ఉద్యోగి మార్క్ జెన్ పది రోజులపాటు సస్పెండ్ అయ్యాడు.
* బ్లాగు కారణంగానే గతేడాది ఫ్రెంచ్ మహిళ క్యాథెరీన్ శాండర్సన్ తన ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత న్యాయపోరాటంలో గెలిచిన ఆమె తన బ్లాగు జ్ఞాపకాలను పుస్తకంగా రాస్తున్నట్టు ప్రకటించారు.
* ఇస్లాం గురించి ఈజిప్ట్ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ గురించి అభ్యంతరకరంగా రాశాడన్న కారణంగా కరీమ్ అమర్ అనే యువకుడికి నాలుగేళ్ల జైలుశిక్ష పడింది.
* విద్యా నాణ్యత బాగోలేదని రాసినందుకుగానూ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ తమ సీనియర్ లెక్చరర్‌ను బ్లాగు మూసెయ్యాలని ఆదేశించింది.
* తన శృంగార జీవితాన్ని బ్లాగుకెక్కించిన జెస్సికా కట్లర్ అనే అమెరికన్ ఉద్యోగం పోగొట్టుకుంది. ఈ వ్యవహారాన్ని రచ్చ చేసినందుకుగానూ ఆమె ప్రియుడు పరువునష్టం దావా వేశాడు.
Courtesy: ఈనాడు
Telugu Andhra Pradesh blogging blog blogs blogger wordpress six apart India Indian Eenadu article bloggers
2 Comments:
enti boss enadu book copy chesaru
e vishayam memu booklo chadavagalam kada . kothaga rayadaniki try cheyandi
3 advantages:
1. Eenadu book/site this article is not in Unicode. Here it is in unicode, and hence appears in search engine listings (unicode search)
2. The English keywords at the bottom increase the probability of pulling out the article during searches
3. People who do not read Eenadu paper / site, might get a chance to read this
Post a Comment
<< Home