"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Saturday, July 21, 2007

'హ్యారీ' పిడుగా!


జులై 21, 2007...
ఆ రోజు చాలామంది పిల్లలు తెల్లవారుజామునే నిద్రలేస్తారు (అసలు రాత్రంతా నిద్రపోతేగా!).
చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జాములు తప్పవు (ముఖ్యంగా పుస్తకాల దుకాణాలున్న చోట!).
కొరియర్‌ సిబ్బందికీ చేతినిండా పని. ఆన్‌లైన్‌ ఆర్డర్లకు డెలివరీ ఇవ్వాలి మరి (ఆ తేదీని తలుచుకుంటేనే భయమేస్తోందట!).
బాసులూ జాగ్రత్త! చాలా మంది ఉద్యోగులు సెలవుపెట్టే ప్రమాదం ఉంది (మీరు సెలవు ఇవ్వనన్నా 'లైట్‌ తీస్కో' అని చెక్కేస్తారు).
...ఈ హంగామాకు కారణం హ్యారీ మానియా!
జేకే రోలింగ్‌ చివరి పుస్తకం 'హ్యారీ పాటర్‌ అండ్‌ ద డెత్‌లీ హ్యాలోస్‌' ఆరోజే విడుదల కాబోతోంది!
స్కాట్‌లాండ్‌లోని ఓ ప్రాంతం...
చికటి. చిమ్మ చికటి. నలుగురు ముసుగు దొంగలు ఓ ఇంట్లోకి ప్రవేశించారు. పడకగదిలో తప్ప ఎక్కడా లైట్లు వెలగడం లేదు. 'ష్‌...! ఎవరో ఉన్నారు. జాగ్రత్తగా రండి. ఎక్కడెక్కడ వెతకాలో తెలుసుగా?' రహస్యంగా చెప్పిందో స్వరం.
మిగతావాళ్లు తెలుసన్నట్టు తలూపారు.
ఒకరు బీరువావైపు కదిలారు. ఒకరు పుస్తకాల అర మీద దాడి చేశారు. మూడో దొంగ షోకేస్‌ వైపు నడిచాడు. అరగంటసేపు అలా కళ్లకు భూతద్దాలు పెట్టుకుని గాలించారు.
'ఎక్కడా లేదు'... వెుదటి స్వరంలో అసహనం.
'చిత్తుకాగితం కూడా దొరకలేదు'... రెండో స్వరంలో నిరాశ.
'మరెక్కడ దాచుంటారు?'... మూడో స్వరంలో ఏడుపు.
నాలుగోవాడైతే, ఏకంగా గుక్కపెట్టి ఏడవడం వెుదలెట్టాడు.
'ఛి...పిరికివెధవ. వీణ్ని తీసుకురావడం నాదే తప్పు' పెద్ద దొంగ విసుక్కున్నాడు.

అంతలోనే ఇంట్లోని లైట్లన్నీ ఒక్కసారిగా వెలిగాయి. దొంగలు దొరికిపోయారు. ఓ యువతి బెడ్‌రూమ్‌లోంచి బయటికొచ్చింది. 'సారీ కిడ్స్‌! మీకేం కావాలో నాకు తెలుసు. అదిక్కడ లేదు. ఇక దయచేయండి'... నవ్వుతూ అయినా, కాస్త కటువుగానే చెప్పింది. పాపం! ఆ పిల్లదొంగలు నిరాశగా బైటికెళ్లిపోయారు. వాళ్లు ఏ నగోనట్రో దోచుకోడానికి రాలేదు. హ్యారీపాటర్‌ చివరి పుస్తకాన్ని చదవడానికి వచ్చారు. అది ఆ పుస్తక రచయిత్రి రోలింగ్‌ ఇల్లు!

ఏం చేస్తారు... సస్పెన్స్‌ తట్టుకోలేకపోతున్నారు.
రోలింగ్‌కు ఇలాంటి గడుగ్గాయిల సంగతి బాగా తెలుసు. అందుకే తను రాసిన కాగితాల్ని ఎవరికీ దొరకనంత జాగ్రత్తగా దాచిపెట్టారు.
... 'హ్యారీపాటర్‌ అండ్‌ ద డెత్‌లీ హ్యాలోస్‌' చదవడానికి ఆమె పొరుగింటి పిల్లలే కాదు, ప్రపంచమంతా ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.
భారతీయ కాలమానం ప్రకారం జులై 21 ఉదయం ఆరు గంటల దాకా... ఆ సస్పెన్స్‌ బలవంతంగా అయినా భరించాల్సిందే.
ఎందుకంత ఆత్రుత? ఏముందా పుస్తకంలో?

అనగనగా హ్యారీపాటర్‌ అనే కుర్రాడు. అమ్మానాన్న ప్రమాదంలో చచ్చిపోతారు. మేనమామ ఇంట్లో పెరుగుతుంటాడు. అక్కడ అందరూ హీనంగా చూస్తుంటారు. సరిగ్గా పదకొండో పుట్టినరోజున ఓ అద్భుతం జరుగుతుంది. ఓ వింత ఆకారం వచ్చి అతన్ని మంత్రాల బడికి తీసుకెళ్తుంది. ఇక అసలు కథ వెుదలవుతుంది. దయ్యాలు, భూతాలు, మంత్ర శక్తులు, మాంత్రికులు, వింతవింత జీవులు...అదో మాయలమారి లోకం! అక్కడే పాటర్‌ మంత్రవిద్యలు నేర్చుకుంటాడు. మధ్యమధ్యలో ఊహించనన్ని మలుపులుంటాయి. భయపెట్టే పాత్రలుంటాయి. గగుర్పాటు కలిగించే చేష్టలుంటాయి. కథానాయకుడికి పదకొండేళ్లు రావడంతో వెుదలైన కథ...పదిహేడేళ్లు నిండాక ముగుస్తుంది. అంటే ఏడేళ్లు! వెుత్తం ఏడు పుస్తకాలు. తొలి పుస్తకం పేరు 'హ్యారీపాటర్‌ అండ్‌ ద సోసరర్స్‌ స్టోన్‌'. 1997లో విడుదలైంది. జులై ఇరవై ఒకటిన ఏడో పుస్తకం 'హ్యారీపాటర్‌ అండ్‌ ద డెత్‌లీ హ్యాలోస్‌' రాబోతోంది. ఇదే చివరిది. కథ కంటే కథనం అద్భుతం. పాత్రల్ని మలిచిన తీరు వైవిధ్యం. శైలి వెన్న పూసిన బన్నులా మెత్తమెత్తగా కమ్మకమ్మగా సాగుతుంది.

బోలెడంత కల్పన, మంత్రతంత్రాలు కలగలిసి చదువరిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఏకబిగిన వందల పేజీలు చదివిస్తాయి. ప్రతి భాగంలోనూ ఓ సమస్య, దాన్ని కథానాయకుడు వీరోచితంగా ఎదుర్కొనే తీరు, మధ్యమధ్యలో మంత్రాల మసాలా... ఇప్పటిదాకా వచ్చిన ఆరు భాగాల్లోనూ దాదాపుగా ఇదే పద్ధతి. వెుదటి భాగం చదివినవారికే రెండో భాగం అర్థమవుతుంది. రెండో భాగం చదివిన వారికి మూడో భాగం సుబోధకం అవుతుంది. వెుదటి భాగాన్ని వెుదలుపెడుతున్నప్పుడే రోలింగ్‌ చివరి భాగం ఎలా ముగించాలన్నదీ నిర్ణయించుకున్నారు. ఒక్కో పుస్తకంతో హీరో వయసు ఒక్కో ఏడాది పెరుగుతూ పోతుంది. మాటతీరులోనూ గాంభీర్యం, పరిణతి కనిపిస్తాయి. 'ఇది పిల్లల పుస్తకం కాదు. పెద్దల పుస్తకమూ కాదు. నేను ఎవర్నీ దృష్టిలో పెట్టుకుని రాయలేదు' అని రచయిత్రి చెబుతున్నా... బ్రిటిష్‌ ప్రచురణకర్త బ్లూమ్స్‌బరీ, అమెరికన్‌ ముద్రణ సంస్థ స్కాలస్టిక్‌ ప్రెస్‌ వెుదటి పుస్తకాన్ని పిల్లల కోసమనే మార్కెట్లో వదిలారు. కానీ అది పిల్లలకు ఎంత నచ్చిందో, పెద్దలకూ అంతకంటే ఎక్కువే నచ్చింది. తాను చివరి భాగంలోని చివరి పేజీ రాసిన ఎడిన్‌బరోలోని బాల్‌వెురాల్‌ హోటల్లోని రూమ్‌ నం. 652లో 'ఇక్కడే జేకే రోలింగ్‌ హ్యారీ పాటర్‌ అండ్‌ ద డెత్‌లీ హ్యాలోస్‌ పుస్తకాన్ని ముగించారు' అని రాసిపెట్టారు. ఆమె పని అంతటితో పూర్తయింది. పాఠక ప్రపంచంలో ఉత్కంఠ వెుదలైంది.

ఏముందో...ఏవో!
ఏడో పుస్తకంలో 'రెండు ప్రధాన పాత్రల్లో ఒకటి చచ్చిపోతుంది. ఆ వివరాలు మాత్రం చెప్పను' అని రోలింగ్‌ ఇప్పటికే స్పష్టంచేశారు. పాటర్‌ పాత్ర కచ్చితంగా మరణిస్తుందనే ప్రచారమూ ఉంది. చివరి అధ్యాయం గురించి మాత్రం రోలింగ్‌ ఒకటిరెండు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. 'ఈ పుస్తకంలో చాలా చావులు ఉండొచ్చు. అలాగని నేనేం కసికొద్దీ చంపలేదండోయ్‌! అసలే దెయ్యాలతో పోరు. కొంతమందైనా బలికాక తప్పదు. కానీ ఒక మాట, బతికున్న పాత్రలన్నీ మంత్రాల బడి వదిలి వెళ్లాక ఎలా ఉండబోతున్నాయన్నది చివర్లో వివరిస్తాను. పాటర్‌ తల్లి గురించి కూడా ఓ పరమ రహస్యాన్ని చెప్పబోతున్నా. అతని కళ్లు అచ్చంగా తల్లి కళ్లలానే ఉంటాయి. ఈ పోలిక వెనకా ఓ పెద్ద కథే ఉంది. డంబుల్‌డోర్‌ మాత్రం చచ్చితీరతాడు. అవ్మో! ఇప్పటికే చాలా చెప్పేశాను. ఇక పెదవి విప్పితే ఒట్టు' అంటూ నోటికి తాళం వేసుకున్నారు.

'మీలో ఎవరికైనా ఈ కథ ముగింపు ఎలా ఉంటుందో తెలిసినా, మిగతావారికి చెప్పకండి. చక్కని పుస్తకాన్ని చదువుతూ వాళ్లు పొందే అనుభూతిని దూరం చేయకండి' అని విజ్ఞప్తి చేస్తున్నారామె. నిజమే, చివరి పుస్తకంలో ఏముంటుందో తెలుసుకోడానికి అభిమానులు చేయని ప్రయత్నం లేదు. కొంతమంది గడుగ్గాయిలు ఆమె ఇంట్లోకి దొంగతనంగా వెళ్లారు. ఓ సాఫ్ట్‌వేర్‌ కుర్రాడు ప్రచురణ సంస్థ కంప్యూటర్లలోకి తొంగిచూసే ప్రయత్నం చేశాడు. ఇక బ్లాగుల్లో బోలెడు ఊహాత్మక కథనాలు. నెట్‌లో ఇప్పటికే 'డెత్‌లీ హ్యాలోస్‌' పేరుతో ఓ పుస్తకం దర్శనమిస్తోంది. అది ఎంతవరకు అసలైందో జులై 21 తర్వాతే తెలుస్తుంది. హ్యారీపాటర్‌ సినిమాల హీరో డేనియల్‌ రాడ్‌క్లిఫ్‌ అయితే పత్రికల వాళ్లతో ఆ నవల గురించి మాట్లాడాలంటేనే జంకుతున్నాడు. ''ఇంతకు ముందు నేను నిోరుజారి కథ చివర్లో పాటర్‌ చనిపోతాడేవో అంటే... పత్రికలవాళ్లు 'పాటర్‌ చావుకోరుతున్న డానియల్‌' అని పెద్ద హెడ్డింగులు పెట్టి వార్తలు రాశారు. ఇక నేను చచ్చినా మీతో మాట్లాడను'' అని వెుహం తిప్పుకుంటున్నాడు. 'ఎప్పుడో ఓసారి పాటర్‌తో వీడ్కోలు తీసుకోవాల్సి వస్తుందని నాకు తెలుసు. కానీ ఆ ఎడబాటు ఎంత బాధాకరవో ఇప్పుడు అర్థం అవుతోంది. ఇంత భావోద్వేగాన్ని ఎప్పుడూ అనుభవించలేదు' అంటారు రోలింగ్‌ చివరి పుస్తకం గురించి ప్రస్తావిస్తూ. పాటర్‌ మరణిస్తాడన్న ఊహను కూడా చాలామంది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 'పాటర్‌ బతకాలి' అంటూ ఓ ఉద్యమాన్నే లేవదీశారు. ప్రఖ్యాత రచయితలు జాన్‌ ఇర్వింగ్‌, స్టీఫెన్‌ కింగ్‌ కూడా దీనికి మద్దతు ఇస్తున్నారు. అయినా, రచయిత్రి మనసు మారినట్టులేదు.

తాజా కేకులు!
ఫిబ్రవరి ఒకటిన విడుదల తేదీని ప్రకటించిన మరుక్షణమే 'హ్యారీపాటర్‌ అండ్‌ ద డెత్‌లీ హ్యాలోస్‌' బెస్ట్‌సెల్లర్స్‌ జాబితాలో చేరిపోయింది. అమెరికన్‌ ప్రచురణ సంస్థ స్కాలస్టిక్‌ కోటి కాపీల ముద్రణకు ఏర్పాట్లు చేసుకుంది. ఒక్క అమెజాన్‌ డాట్‌కామ్‌ ద్వారానే పదహారు లక్షల కాపీలు ముందస్తుగా అమ్ముడుపోయాయి! పుస్తకాలకు అంతంతమాత్రం గిరాకీ ఉన్న భారత్‌లోనే ఆరో భాగం విడుదలైన గంటకే లక్ష కాపీలు అమ్ముడుపోయాయి. ఆ తర్వాత మరో అరవై వేల కాపీలు ఖర్చయ్యాయి. ఇక పైరసీకి లెక్కేలేదు. తాజా పుస్తకం రెండు లక్షల కాపీలు అమ్ముడుపోవచ్చని పెంగ్విన్‌ ప్రచురణకర్తల అంచనా. పాటర్‌ పుస్తకాల రచయిత్రిగా రోలింగ్‌ సాధించిన అవార్డుల జాబితా చాంతాడంత. ఇక ఆదాయానికి లెక్కేలేదు. హ్యారీపాటర్‌ పుస్తకాన్ని ప్రచురిస్తున్న బ్లూమ్స్‌బరీకి చివరి పుస్తకం తర్వాత లాభాలు గణనీయంగా పడిపోతాయనే భయం పట్టుకుంది. అందుకే, కొత్త రచయితల కోసం అంజనం వేసి గాలిస్తోంది.

వెండితెర బంగారుకొండ!
హ్యారీపాటర్‌ కథల్ని వార్నర్‌ బ్రదర్స్‌ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటిదాకా వచ్చిన నాలుగు సినిమాలూ సూపర్‌ హిట్‌! 5 బిలియన్‌ డాలర్లు వసూలు చేశాయి. 'ఆర్డర్‌ ఆఫ్‌ ద ఫీనిక్స్‌' కూడా అంతే హంగామా సృష్టించనుంది. 150 మిలియన్‌ డాలర్లతో నిర్మించిన ఈ సినిమాకు ఇంకో ప్రత్యేకత ఉంది. ఇందులో హ్యారీ పసితనపు ఛాయల నుంచి బయటికొచ్చి...రొమాంటిక్‌గా కనిపిస్తాడు. తన ప్రేయసిని ముద్దుపెట్టుకుంటాడు. 'వెుదట్లో కాస్త ఇబ్బందిగానే అనిపించిందికానీ, ఒకటిరెండు టేకుల్లో సర్దుకున్నాను' అంటాడు హ్యారీ పాత్రధారి రాడ్‌క్లిఫ్‌. ఆ సినిమా బృందానికీ ఆ దృశ్యాన్ని చూసి ముచ్చటేసిందట! ఎందుకంటే, వాళ్లంతా అతన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నవారే. ఆరో పుస్తకాన్ని కూడా సినిమాగా తీయడానికి వార్నర్‌ బ్రదర్స్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. హ్యారీ వీరాభిమానులకు అందులిోని రెండు ప్రధాన పాత్రల్లో నటించే అవకాశం ఇచ్చారు. చివరి భాగమూ 2010లో సినిమాగా రాబోతోంది.

మన సంగతేంటి?
పిల్లల పుస్తకాల్లో మనదే పెద్ద స్థానం. పంచతంత్ర కథలు, అక్బర్‌ బీర్బల్‌ కథలు, భట్టివిక్రమార్క కథలు, కాశీమజిలీ కథలు...మనకున్న కథా సంపద అపారం. వాటికిలేని ఆదరణ, 'హ్యారీపాటర్‌'కు ఎందుకుంది? మిగతా ప్రపంచం సంగతి వదిలేస్తే, మన దగ్గర కూడా లక్షల కాపీలు ఎందుకు అమ్ముడుపోతున్నాయి. 'కాలంతో పాటూ మన కథలు మారడం లేదు. మూస ధోరణిలో కొట్టుకుపోతున్నాయి. వాటి ముగింపు ఎలా ఉంటుందో ఇట్టే ఊహించవచ్చు. దానికితోడు నీతి సూత్రాల్ని కృతకంగా అయినా జొప్పించే ప్రయత్నవెుకటి. అందుకే పిల్లలు వాటిని చదవడం మానేశారు. కొత్తదనం కోరుకుంటున్నారు. ఆ హంగులన్నీ పాటర్‌ పుస్తకాల్లో ఉన్నాయి' అంటారు వందన బిస్త్‌ అనే పిల్లల పుస్తకాల రచయిత్రి. 'ఇది మన మార్కెటింగ్‌ వైఫల్యం తప్ప ఇంకేం కాదు' అన్నది మమాంగ్‌దాయ్‌ అనే అరుణాచల్‌ప్రదేశ్‌ రచయిత్రి అభిప్రాయం. పాటర్‌ అనుభవం నుంచి భారతీయ బాలసాహిత్యం ఎంతో కొంత పాఠం నేర్చుకున్నట్టే కనిపిస్తోంది. కొన్ని ప్రచురణ సంస్థలు పాత కథల్నే కొత్త హంగులతో మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.

వివాదాలు...
రోలింగ్‌ పుస్తకాలు పిల్లల్ని చెడగొడుతున్నాయి, శాస్త్రీయ ధోరణుల నుంచి మంత్రతంత్రాల వైపు మళ్లిస్తున్నాయంటూ కొంతమంది తల్లిదండ్రులు గగ్గోలుపెడుతున్నారు. విదేశాల్లో ఒకరిద్దరు కోర్టుకు కూడా వెళ్లారు. 'ఇలాంటి పుస్తకాలు చదవడం వల్ల పిల్లల్లో సృజన పెరుగుతుంది. ధైర్యసాహసాలు అలవడతాయి' అనేవారూ ఉన్నారు. ఈ వర్గం ఇటీవలే వెలువడ్డ ఓ సర్వే ఫలితాల్ని ఉటంకిస్తోంది. నాలుగు సంవత్సరాల పాటూ జరిగిన ఈ అధ్యయన ఫలితాల్ని 'జర్నల్‌ ఆఫ్‌ రిసెర్చ్‌ ఇన్‌ క్యారెక్టర్‌ ఎడ్యుకేషన్‌ి' వెల్లడించింది. పాటర్‌ పుస్తకాలు పిల్లల్లో ధైర్యాన్ని నూరిపోస్తున్నాయన్నది దాని సారాంశం. ఎక్కడైనా మంచిచెడూ రెండూ ఉంటాయి. క్షీరనీర న్యాయం బాల సాహిత్యానికీ మినహాయింపేం కాదు.



Courtesy: ఈనాడు
Harry Potter J.K.Rowling Telugu


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


1 Comments:

At 12:14 AM, Anonymous Anonymous గారు చెప్పినారు...

మంచి కలెక్శన్. మీ బ్లాగ్ లో తెలుగులో కూడా పోస్ట్లూ ఉండడం విశేషం. మేరు తెలుగు లో వ్రాయడనకి ఎం వాడతారు? నేను www.quillpad.in/telugu వాడుతున్నాను

 

Post a Comment

<< Home