"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Saturday, November 25, 2006

సత్యహరిశ్చంద్రికలు

తెలుగు నాటక పద్యాలు శ్రావ్యంగా విన్పిస్తోంటే ఆడిటోరియంలోకి తొంగిచూశాను. సత్యహరిశ్చంద్ర నాటకంలో చంద్రమతిని అమ్మేసే దృశ్యం. పురుషులు పద్యాలు పాడుతోంటే గాంభీర్యం శాతం ఎందుకిలా ఉందబ్బా..అనిపించింది.వెంటనే ఆరాతీస్తే... ఆ పాత్రధారులంతా మహిళలేేనని తెలిసింది. నాటకాల్లో స్త్రీ పాత్రలను పురుషులు వేయడం చూశాం. కానీ ఇప్పుడు మహిళలే పురుష పాత్రలను ధరించి కొత్త సంప్రదాయానికి తెరతీశారు అనంతపురం జిల్లా నటీమణులు.


హైదరాబాదులోని త్యాగరాయ గానసభలో కిన్నెర సాంస్కృతిక సంస్థ నిర్వహిస్తున్న పౌరాణిక, పద్యనాటకోత్సవాల్లో భాగంగా ఎస్‌.ఆర్‌.కె. కళాస్రవంతి కళాకారిణులు సత్యహరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శించి ఔరా! అనిపించారు. పదిహేనేళ్ల బాలిక నుంచి యాభై ఏళ్ల స్త్రీల వరకు ఈ నాటకంలో హరిశ్చంద్రుడు, విశ్వామిత్రుడు, నక్షత్రకుడు, వీరబాహుడు లాంటి పాత్రల్లో ఒదిగిపోయారు. పద్యాలను హృద్యంగా ఆలపించి సత్తా చాటుకున్నారు. ప్రేక్షకుల కరతాళధ్వనులు, జేజేలు అందుకున్నారీ ప్రతిభావనులు. సినిమా, టీవీ సీరియల్స్‌లో నటించే కళాకారులకు అభినయం ఉంటే చాలు. మధ్యలో కట్లూ.. ఓకేలూ ఉంటాయి కాబట్టి నటనలో లోపాలున్నా సవరించుకునే వీలుంటుంది. సంభాషణలు కూడా తర్వాత చూసి చెప్పవచ్చు. చెప్పకపోయినా డబ్బింగ్‌ ఉండనే ఉంటుంది. కానీ రంగస్థలం మీద నటించడమంటే మాటలు చెప్పినంత సులువు కాదు. ఆంగికాభినయంతోపాటు స్పష్టమైన వాచికం, సంగీతజ్ఞానం కచ్చితంగా ఉండాలి. పాత్రకు తగ్గట్టుగా వేషధారణలో ఇమిడిపోవాలి. ఇక పౌరాణిక, పద్యనాటకాలైతే ఊపిరి బిగబట్టి హార్మోనియం మెట్ల మీద పైస్థాయిని అందుకోగల రాగాలాపనలూ ఉంటాయి. ఇన్నాళ్లూ పద్యనాటకాలను వేయడం పురుషులకే సాధ్యమన్న భావనని చెరిపేశారీ నటీమణులు. నటజీవితంలో తెరముందు వారికిది పున్నమి వెలుగైతే.. తెరవెనుక నిజజీవితంలో చేదు అనుభవాల కటిక చీకట్లు కమ్ముకునే ఉన్నాయి. వాటి గురించి ఈ వృత్తికళాకారిణులు ఏమంటున్నారంటే..

దయనీయమే: వనజకుమారి
నాటకాల్లో నటించి ప్రేక్షకుల మెప్పుపొందుతున్నామన్న తృప్తేగానీ.. తాతల కాలం నుంచీ మా జీవితాలకు ఆర్థికపరమైన స్థిరత్వం లేదు. ముఖ్యంగా మాలాంటి మహిళా వృత్తికళాకారుల పరిస్థితి దయనీయమనే చెప్పాలి. నాటకరంగంలోని స్త్రీలం... కేవలం ఆటబొమ్మలుగానే మిగిలిపోతున్నాం. మాలాంటి వృత్తికళాకారిణులనైనా ప్రభుత్వం ఆదుకుని చేయూతనిస్తే నాటకం పదికాలాలపాటు నిలబడుతుంది.

నాటకమే ఊపిరి: విజయలక్ష్మి
వందేళ్ల తెలుగు నాటక ప్రాభవాన్ని పదికాలాలపాటు నిలబెట్టేందుకే మా తాతలనాటి వారసత్వకళను అందిపుచ్చుకున్నాం. ఇతరత్రా వ్యాపకాలేమీ పెట్టుకోకుండా నాటకమే ఊపిరిగా బతుకుతున్నాం. మహిళలు నాటకాలు వేయడం ఇదివరకే చూసినా వృత్తికళాకారిణులంతా కలిసి పూర్తి నిడివిలో పద్యనాటకాన్ని ప్రదర్శించడం ఇదే ప్రథమమని చెప్పాలి. హరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శించిన ప్రతిచోటా 'డి.వి.సుబ్బారావు, బండారు వంటి కళాకారులను గుర్తు చేశారమ్మా!' అంటూ ప్రముఖులు సైతం మెచ్చుకుంటుంటే.. ఇంకా శ్రీకృష్ణరాయబారం, తులాభారం, బాలనాగమ్మ లాంటి ప్రసిద్ధ నాటకాలను కూడా వేయాలన్న ఉత్సాహం కలుగుతోంది. కానీ ఆర్థికపరమైన ఇబ్బందులు వెనక్కి లాగుతున్నాయి. ప్రభుత్వపరంగా చేయూతనందిస్తే సమాజాన్ని జాగృతపరిచే పురాణగాధల్ని కూడా పద్యనాటకాలుగా రూపొందించగలం.

- గంగాధర్‌ వీర్ల, న్యూస్‌టుడే, హైదరాబాద్‌

Courtesy: ఈనాడు
Telugu Andhra Pradesh drama theatre eenadu article november 2006 vasundhara


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'