Thursday, September 15, 2005

బుద్ధుడు నవ్వుచూ నిలిచెన్‌

రాజ్యభోగము వీడగలిగిన
రాకుమారుని రాతిజేసి
రాజధానిలొ నిలిపివేయగ
చిన్నగా నవ్వెన్‌ బుద్ధుడు నవ్వుచూ నిలిచెన్‌

పదవికోసం పాకులాటలు
కీర్తికోసం కీచులాటలు
ఓట్లకోసం ఊగులాటలు
చూడగా నవ్వెన్‌ బుద్ధుడు నవ్వుచూ నిలిచెన్‌

ప్రేమపక్షుల సరస శోభలు
ప్రేమవిఫలుల తొలుచు క్షోభలు
ప్రేమతెలియని బుడుత ఎడదలు
చూడగా నవ్వెన్‌ బుద్ధుడు నవ్వుచూ నిలిచెన్‌

మమతలేని బతుకు వద్దని
మార్కు రాని ఫలితమొద్దని
మార్గమిది యని చావ గోరుట
చూడగా నవ్వెన్‌ బుద్ధుడు నవ్వుచూ నిలిచెన్‌

ముదముతో ఘన పూజ సల్పిన
మురికి నీరే పార జేసిన
ముక్కు మూయక నోరు విప్పక
చూచుచూ నవ్వెన్‌ బుద్ధుడు నవ్వుచూ నిలిచెన్‌

నిదురరాని జనుల వ్యథలు
మేలుకోని వారి వెతలు
కలలు మాత్రము కనెడి కనులు
చూచుచూ నవ్వెన్‌ బుద్ధుడు నవ్వుచూ నిలిచెన్‌

మధ్యగోడలు లేని బాటలు
ఎడమ కుడియై కుడియె ఎడమై
కొంపగూల్చెడు రోడ్డు చావులు
చూచుచూ నవ్వెన్‌ బుద్ధుడు నవ్వుచూ నిలిచెన్‌

కినుకు చెంది బస్సు కాల్చి
బస్సులేదని కోపమందే
చిత్త వృత్తుల చేతనత్వము
చూచుచూ నవ్వెన్‌ బుద్ధుడు నవ్వుచూ నిలిచెన్‌

కలుషితంబగు గాలి నీరును
కడిగివేయుదు మనుచు పల్కుచు
ప్రజల యందే పొగను త్రాగగ
చూచుచూ నవ్వెన్‌ బుద్ధుడు నవ్వుచూ నిలిచెన్‌

పంటలెండి బతుకు మండి
వడ్డి తీర్పగ సాయ మందక
"చితి"కి పోయిన కలుగు సాయము
చూడగా నవ్వెన్‌ బుద్ధుడు నవ్వుచూ నిలిచెన్‌

విగ్రహాలకు పూజలొద్దని
వివరముగ బోధనలు జేసిన
వేల్పుయని విగ్రహము నిల్పగ
చూచుచూ నవ్వెన్‌ బుద్ధుడు నవ్వుచూ నిలిచెన్‌

- శ్రీనివాస్ నాగులపల్లి
[ Srinivas Nagulapalli ]
srini_nagul@yahoo.com

No comments:

Post a Comment