ఇంటర్నెట్ ఆవిష్కరణ తరువాత సమాచార ప్రక్రియలో సమూలమైన మార్పులు సంతరించుకున్నాయి. ఈ పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత దీనిని
మరింత సమర్థవంతంగా వినియోగించుకొనే దిశగా సెర్చ్ ఇంజన్లు ఆవిష్కృతమయ్యాయి. ఒకమూలన కూర్చొని బుల్లితెరపై ఏదేని ఒక అంశాన్ని ఇవ్వడమే తరువాయి.... సదరు అంశానికి సంబంధించిన సమాచారంతో వందలాది పేజీలు మానిటర్‌పైన ప్రత్యక్ష మవుతున్నాయి.
ఇక విద్యార్థులకు, పరిశోధకులకు సెర్చ్ ఇంజన్లు సహకరిస్తున్న తీరును పరిశీలిస్తే విద్యాత్మక, పరిశోధ నాత్మక అంశాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని అందించ డంలో ఇవి తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విద్యా రంగంలో ఎంతో ఉపయుక్తంగా వ్యవహరిస్తున్న ఈ తరహా సెర్చ్ ఇంజైన్ల గురించి తెలుసుకుందాం...!
సెర్చ్ ఇంజన్లు అనగానే గూగుల్ డాట్‌కామ్, యహూ డాట్‌కామ్, అల్తావిస్తా డాట్‌కామ్ వంటి అతి కొద్ది సైట్లు మాత్రమే మనకు సహజంగా గుర్తుకొస్తాయి. ఇవి నిత్య వ్యవహారంలో ఉండే లక్షలాది అంశాలకు సంబంధించిన సమాచారాన్ని మనకు అందిస్తున్నాయి. అయితే ఇవే కాకుండా మరెన్నో సైట్లు కొన్ని ప్రత్యేక అంశాలకు సమాచారాన్ని అందించే సేవలో నిమగ్నమయ్యాయి. గణితం, భౌతిక, రసాయనశాస్త్రాల వంటి సంప్రదాయ పాఠ్యాంశాలతో పాటు, అధునాతన సబ్జెక్టులపైన కూడా పలు ఇతర వెబ్‌సైట్లు అవసరమైన వారికి తగిన సమాచారాన్ని అందిస్తున్నాయి. విలువైన పుస్తకాలు, పరిశోధన ఫలితాలు, పాత ప్రతులు(ఆర్కివ్స్) ఇలా మరికొన్ని ఇతర అంశాలపై సేవలందిస్తున్న సెర్చ్ ఇంజన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని సర్చ్ వెబ్‌సైట్లను, అవి అందిస్తున్న అంశాలను పరిశీలిద్దాం.
http://psycprints.ecs.soton.ac.uk/
సైకాలజీ, న్యూరోసైన్స్, భాషా శాస్త్రం, కంప్యూటర్ సైన్స్ వంటి అంశాలకు సంబంధించిన పేపర్ల సమాచారాన్ని ఈ వెబ్‌సైట్ అందిస్తుంది. అయితే కంప్యూటర్ సైన్స్‌లో కొన్ని పరిమిత ఏరియాలలో మాత్రమే(ఎఐ, రొబోటిక్స్, విజన్, లర్నింగ్, స్పీచ్, న్యూరల్ నెట్‌వర్క్స్) ఈ సైట్ సమాచారాన్ని అందిస్తుంది. వీటితో పాటు ఫిలాసఫీ, బయాలజీ, మెడిసిన్, ఆంత్రోపాలజీ వంటి అంశాలను, మనో విశ్లేషణ అధ్యయనంలో ఉపకరించే మ్యాథమెటికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ సైన్స్ వంటి అంశాల సమాచారం కూడా లభ్యమవుతుంది.
www.bloomsburymagazine.com/ARC/Arc_home.asp
అసంఖ్యాకమైన పుస్తకాల సమాచారాన్ని అందించేదిగా దీనిని ఒక అద్భుతమైన సెర్చ్‌సైట్‌గా పేర్కొనాలి. దాదాపు 17,000 కోట్ల గ్రంథాల సమాచారాన్ని ఈ సైట్ రెప్పపాటులో మన ముందు ప్రత్యక్షం గావిస్తుంది. ఇందుకు అవసరమైర సామర్థ్యం మేరకు డేటాబేస్ కల్గివున్న సైట్ ఇది. ఒక అంశానికి సంబంధించిన ఇతర లింకులను, సాహిత్యానికి సంబంధించిన సైట్లను సూచిస్తుంది. సాహిత్యం, మానవ తత్వశాస్త్రం, మైథాలజీ, కళాతాత్వికత వంటి అంశాల సమాచారాన్ని అందిస్తుంది. ఇంత విస్తృత సమాచారాన్ని అందిస్తున్న కారణంగా ఈ సైట్‌ని ఒక పరిశోధన కేంద్రంగా వ్యవహరిస్తారు.
www.diva-portal.se/index.xsql?lang=en
పరిశోధనలకు సంబంధించిన నివేదిక పత్రాలు, ప్రాజెక్టులకు సంబం ధించిన నివేదికలు, ఇతర అధ్యయనాల పత్రాలకు, ప్రచురణ పత్రాలు ఈ వెబ్‌సైట్‌లో దర్శనమిస్తాయి. వేర్వేరు పాఠ్యాంశాలపైన ఈ నివేదికలను పొందవచ్చు. ఎక్కువగా కొన్ని పరిమిత ప్రాంతాలకు చెందిన విశ్వవిద్యాలు చేపట్టిన పరిశోధన పత్రాలు ఈ సైట్‌లో లభ్యమవుతాయి. ఈ సైట్‌నే డిజిటల్ సైంటిఫిక్ ఆర్కివ్‌గా పేర్కొంటారు.
www.eevlxtra.ac.uk/
ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్ తదితర అంశాల సమాచారాన్ని అందించే సైట్‌లలో ప్రధానంగా పేర్కొనదగిన సెర్చ్ వెబ్‌సైట్ ఇది. పలు పత్రికల్లో ప్రచురితమైన వ్యాసాలు, పుస్తకాలు, వెబ్‌సైట్ల యుఆర్‌ఎల్ చిరునామాలు, పరిశ్రమల వార్తలు, సాంకేతిక నివేదికలు, టెక్ని కల్ డాటా, టెక్స్ట్ ప్రింట్లు, పరిశోధన, బోధన, అధ్య యన వనరులు తదితర అంశాలు ఈ వెబ్‌సైట్‌లో లభిస్తాయి.
http://cdsweb.cern.ch/
దీనినే సిఇఆర్‌ఎన్ డాక్యుమెంట్ సర్వర్‌గా పిలుస్తారు. పార్టికల్ ఫిజిక్స్‌తో పాటు ఈ శాస్త్రానికి సంబంధించిన ఇతర ఉప ప్రధాన అంశాల సమా చారం కావాలనుకొనే వారికి కేవలం ఈ ఒక్క సైట్‌లోనే సమగ్రంగా లభించే అవకాశం ఉంది. ఈ వెబ్‌లో దాదాపు 6,50,000 బైబ్లియోగ్రాఫిక్ రికా ర్డులు ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగకమానదు. వీటిలో 3,20,000 పూర్తిస్థాయి టెక్స్ట్ డాక్యుమెంట్లు, వ్యాసాలు, గ్రంథాలు, ప్రీ ప్రింట్లు, జర్నల్స్, ఛాయా చిత్రాలు ఇంకా మరెంతో సమాచారాన్ని మనకు అందిస్తున్న విభిన్నమైన సర్చ్ ఇంజన్ ఇది.
www.highbeam.com/library/ index.asp
హై బీమ్ లైబ్రరీ రీసెర్చ్‌గా వ్యవహారంలో ఉన్న ఈ వెబ్‌సైట్‌లో దాదాపు 3కోట్ల 40 లక్షలకు పైగా డాక్యుమెంట్లు దర్శనమిస్తాయి. దాదాపు 3000 మార్గాల(సోర్స్) ద్వారా ఈ డాక్యుమెంట్లను వెబ్‌సైట్ స్వీకరించి ఔత్సా హికులకు కావాల్సిన సమాచారాన్ని క్షణాల్లో అందజేస్తుంది. ఇన్ని కోట్ల డాక్యుమెంట్లను తనలో స్టోర్ చేసుకొని క్షణాల్లో అందించగల విస్తృత యంత్రాంగం కలిగి ఉండటం ఈ సర్చ్ ఇంజన్ ప్రత్యేకతగా పేర్కొనాలి. దాదాపు 20 సంవత్సరాల క్రితం కాలంనాటి నుంచి ఇప్పటి వరకు అందు బాటులో ఉన్న డాక్యుమెంట్ల సమాచారాన్ని అందిస్తుంది. అంతే కాదు ఎప్పటికప్పుడు తాజా విశేషాలను కూడా రోజువారీగా అప్‌డేట్ చేస్తూ అత్యంత తాజా సమాచారాన్ని అందించడానికి ఈ వెబ్ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పలు ప్రచు రణలు ఈ వెబ్ నుంచి పొందవచ్చు.
www.archive.org/
ఇదొక అద్భుతమైన డిజిటల్ గ్రంథాలయంగా చెప్పవచ్చు. ఇంటర్నెట్ సైట్లు, సాంస్కృతిక రంగానికి సంబంధించిన సమాచారాన్ని డిజిటల్ రూపంలో అందజేస్తుంది. ఈ సైట్ మరో ప్రత్యేకతను కల్గి ఉంది. కొన్ని విభిన్న తరహా సేవల కోసం అమెరికాలోని యుఎస్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్, స్మిత్‌సోనియన్ అనే సంస్థల భాగస్వామ్యంతో ఈ సెర్చ్ ఇంజన్‌ని ఏర్పాటు చేశారు. దీనినే ఇంటర్నెట్ ఆర్కివ్ అనికూడా పిలుస్తారు.
www.oxfordscholarship.com/oso/public/index.html
ఈ సైట్‌నే సంక్షిప్తంగా ఆక్స్‌ఫర్డ్ స్కాలర్‌షిప్ ఆన్‌లైన్‌గా(ఓఎస్‌ఓ) పేర్కొంటారు. ఇది ప్రత్యేకంగా కొన్ని పాఠ్యాంశాలలో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన గ్రంథాలలోని పూర్తిస్థాయి టెక్స్ట్ సమాచారాన్ని అందిస్తుం ది. అర్థశాస్త్రం, ఫైనాన్స్, తత్వశాస్త్రం, రాజనీతిశాస్త్రం, మత సంబంధమైన అంశాల సమాచారానికి సంబంధించి 920 గ్రంథాలు సైట్‌లో దర్శనమిస్తా యి. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండే సమాచారానికి తోడుగా ప్రతి సంవత్సరం కొత్తగా 200 పుస్తకాల టెక్స్ట్ సమాచారాన్ని జోడిస్తారు.
www.scirus.com
సైన్స్‌కు సంబంధించిన విస్తృత సమాచారాన్ని అందించే సైట్లలో ఇదొక వెబ్. సైన్స్, శాస్త్ర సాంకేతిక విషయాలపై ఈ సైట్ సమగ్రమైన సమాచారాన్ని అందిస్తుంది. సైన్స్‌కు సంబంధించిన సమాచారంపైనే దాదాపు 20 కోట్ల ప్రత్యేక వెబ్‌పేజీలు సైట్‌లో అందుబాటులో ఉండటం గమనార్హం. శాస్త్ర సాంకేతిక అంశాలకు తోడు పలు నివేదికల నుంచి టెక్నికల్, మెడికల్ డాటాను, కీలకమైన వ్యాసాల సమీక్షలు, పేటెంట్ అంశాలు, ప్రీ ప్రింట్లు, జర్నల్స్ సమాచారాన్ని అందిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కొన్ని ఇతర సెర్చ్ ఇంజన్లు అందించలేని సమాచారాన్ని ఈ సైట్ అందిస్తుంది.
www.academicindex.net
దీనినొక మెటా సెర్చ్ ఇంజన్‌గా వ్యవహరిస్తారు. ఎందుకంటే ఇది ఇతర సెర్చ్‌లపై పరిశోధనలు సాగించి అవసరమైన సమాచారాన్ని ఔత్సాహికులకు అందజేస్తుంది. ఏదేని ఒక ప్రత్యేక అంశంపై సమాచారాన్ని కావాలనుకొనే వారికి అదే వృత్తిలో నిమగ్నమైన పలువురు ప్రొఫెసర్లు, లైబ్రేరియన్లు, విద్యావేత్తలు తదితరులు వెతికి తీసిన సమాచారాన్ని శోధించి వెలికి తీసి అందజేసే సర్చ్ ఇంజన్ ఇది. అంటే పరిశోధన స్థాయి గల అంశాలను మాత్రమే ఇది పట్టి ఇస్తుందన్నమాట.
www.completeplanet.com
ఈ సైట్‌ని ఒక సెర్చ్ ఇంజన్ల పురుగుగా వర్ణించవచ్చు. పలు సెర్చ్ ఇంజన్లలో దాగి ఉన్న విస్తృత సమాచారం వెంటపడి ఔత్సాహికులకు కావాల్సిన సమాచారాన్ని వెతికిపట్టి అందిస్తున్న సైట్ ఇది. దాదాపు 70,000 డాటాబేస్‌ల వెంట పరుగుపెట్టి మనకు కావాల్సిన సమాచారాన్ని అందజేయడంలో ఈ సైట్ సేవలు ఎంతో విశిష్టమైనవి. ఇది కూడా కొన్ని ఇతర వెబ్ సర్చ్ ఇంజన్లు పనిచేయని రీతిలో విభిన్న సేవలు అందిస్తున్నది.
ఇదీ...కొన్ని విద్యాత్మక సర్చ్ సైట్లకు సంబంధించిన క్లుప్తమైన సమాచారం. విద్యార్థులు, పరిశోధకులు తమ పాఠ్యాంశాలకు సంబంధించిన ఒక అంశాన్ని సర్చ్ బార్‌లో ఎంటర్ చేసినప్పుడు ఈ సైట్లలో అసంఖ్యాకమైన వెబ్‌పేజీలను అందిస్తాయి. అలాంటి సందర్భంలో ఎవరికైనా సరే సెర్చ్ ద్వారా అందుకొనే వందలాది పేజీలను చూస్తున్నప్పుడు 'వెబ్' తెలుగు అర్ధానికి మాదిరిగానే 'సాలెగూడు'లో చిక్కుకున్నామనే భావన కలుగుతుంది. అప్పుడు తాము వెదుకుతున్న సమాచారంపై చికాకు, అసహనం కూడా కలిగే అవకాశం లేకపోలేదు. దీనికి పరిష్కారం ఒక్కటే పలు అంశాలను వెతికే వారు తమ పరిశోధన పరిమితిని సరైన విధంగా నిర్ధారించుకొని అవసరమైన పదాల మేరకు మనకు కావాల్సిన అంశాన్ని టైటిల్‌గా సర్చ్ బార్‌లో ఎంటర్ చేయడం ద్వారా సగం శ్రమను తగ్గించుకున్న వారమవుతాం. అందుకే సెర్చ్ ఇంజన్లతో కుస్తీ పట్టాల్సివచ్చినప్పుడు ఖచ్చితత్వం, నిశిత పరిశీలన, సూక్ష్మ శోధన వంటి లక్షణాలు కలిగి ఉండాలి.
- ఈర్ల ఉమేష్
Courtesy: ఆంధ్ర జ్యోతి
Good one, indeed
ReplyDelete