కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన 'స్వరాభిషేకం' చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు లభించడం, ఈ చిత్రం ద్వారా జాతీయస్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా విద్యాసాగర్ ఎంపిక కావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ చిత్ర యూనిట్ గురువారం విలేకరులతో సమావేశమయింది. కె.విశ్వనాథ్, నిర్మాతలు కౌసలేంద్రరావు, హరిగోపాలకృష్ణమూర్తి, శ్రీకాంత్, శివాజీ, నరేశ్, సినిమాటోగ్రాఫర్ దుర్గాప్రసాద్, ఎడిటర్ జి.జి.కృష్ణారావు, రచయితలు రమేష్-గోపి, కళాదర్శకుడు వెంకటేశ్వర రావు, గాయని సునీత, గాయకుడు పార్థసారథి, అశోక్‌కుమార్ ఇందులో పాల్గొన్నారు. తానెప్పుడూ కమర్షియల్‌సక్సెస్‌ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు రూపొందించలేదని, ఎప్పుడూ జీతం తీసుకొనే ఉద్యోగిగా ఓ మంచి చిత్రం తీయాలనే తపనతో మాత్రమే సినిమాలు తీశానని, ఈ సినిమాను కూడా అలాగే రూపొందించానని కె.విశ్వనాథ్ చెప్పారు.
యూనిట్ సమష్టి కృషికి ఈ అవార్డు ఓ గుర్తింపు లాంటిందని, విద్యాసాగర్‌కు సన్నివేశం వివరించామే తప్ప ఈచిత్రానికి సమకూర్చిన సంగీతమంతా ఆయన సొంతమేనని, ఆయనకు కూడా అవార్డురావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని విశ్వనాథ్ అన్నారు. తొలి ప్రయత్నంలోనే మంచి సినిమా తీసినందుకు ఆనందంగా ఉందని, అందుకు తగిన గుర్తింపుగా అవార్డులు లభించడం మరింత ఆనందాన్ని కలిగిస్తోందని నిర్మాతలు తెలిపారు. ''విశ్వనాథ్‌గారి దర్శకత్వంలో నటించడమే ఓ అదృష్టమైతే, ఈ సినిమా జాతీయ స్థాయిలో అవార్డులు కూడా సంపాదించి, మాకు మరింత ఆనందాన్ని కలిగించింది'' అని శ్రీకాంత్ అన్నారు. వక్తలందరూ ఈ చిత్రానికి, సంగీత దర్శకుడికి జాతీయ అవార్డులు లభించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు; విశ్వనాథ్‌తో కలసి పనిచేయడం ఓ అదృష్టంగా భావించారు.
కె.విశ్వనాధ్
కళా తపస్వి కె.విశ్వనాధ్ రూపుదిద్దిన 'స్వరాభిషేకం' ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయస్థాయి పురస్కారానికి ఎంపికైన సంగతి తెలిసిందే. చిత్ర స్వరకర్త విద్యాసాగర్ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. అవార్డు ఆనందాన్ని పంచుకునేందుకు చిత్ర బృందం పాత్రికేయులతో సమావేశమైంది. సి.కౌసలేంద్రరావు రాజ రాజేశ్వరి కంబైన్స్ పతాకంపై 'స్వరాభిషేకం' నిర్మించారు. ఆయనకు ఇదే తొలి చిత్రం. కౌసలేంద్రరావు మాట్లాడుతూ ''ఈ రంగంలోకి వచ్చేటప్పుడే విలువలున్న చిత్రాన్ని నిర్మించాలని భావించాను. అందుకే విశ్వనాధ్‌ని సంప్రదించాం. ఆయన అంగీకరించినప్పుడే ఇది మంచి చిత్రం అవుతుందనుకున్నా. ఇప్పుడు అది నిజమని మరోసారి తేలింది. విద్యాసాగర్ శ్రమని గుర్తించి ప్రభుత్వం అవార్డుని అందించడం ఆనందంగా ఉంది. సినిమా ఆర్థికంగా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా... జాతీయ అవార్డు రావడంతో ఆనందానికి అవధులు లేవు'' అన్నారు. ''ఒక చిత్రం ఆర్థిక విజయం అనేది ఎవరి చేతిలోనూ లేదు. నేను నిర్మాణానికి సంబంధించిన అంశాల్లో కలగజేసుకోను. నా చిత్రంలో ప్రతి చిన్న సన్నివేశానికీ ఎంతో కష్టపడాలి. చూసిన వారికి ఆ విషయం తెలీదు. చేసే వారికే తెలుస్తుంది. 'స్వరాభిషేకం'లోని రైలు సన్నివేశం ఎంతో అద్భుతమైంది. అది ఎలా చేయించానా అని ఇప్పటికీ ఆశ్చర్యం కలుగుతుంది. నేనిప్పటి వరకు ఏ చిత్రాన్నీ అవార్డు ఆశించి తీయలేదు'' అని కె.విశ్వనాధ్ చెప్పారు. నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ ''విశ్వనాధ్ దర్శకత్వంలో పని చేయడమే ఒక అదృష్టం. అవార్డులు ఆయనకి పాతే, కాని నాకు కొత్త. అందుకే చాలా ఆనందంగా ఉంది'' అన్నారు. నటులు శివాజీ, నరేష్, అశోక్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత హరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Courtesy:ఈనాడు
No comments:
Post a Comment