Second Life
Article Courtesy: ఈనాడు
పై ఫొటోలో అమ్మాయిని చూశారా... చూడగానే ముచ్చటేస్తోంది కదూ! మీకూ ఇలా తయారవ్వాలని అనిపిస్తోందా! నిజ జీవితంలో సంగతేమో కానీ... వూహాలోకంలో మాత్రం మిమ్మల్ని మీరిలా తీర్చిదిద్దుకోవచ్చు... మీ పేరును మీరే పెట్టుకోవచ్చు... మీ శరీరం రంగును మీ ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు... మీ ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుకోవచ్చు... అంతెందుకు? మీ జీవితం మీ ఇష్టం... మీరు ఎలాగైనా... ఎంత స్వేచ్ఛగానైనా జీవించవచ్చు... మీ ఇంటిని మీరే కట్టుకోవచ్చు... అంటే ఒకరకంగా మీరు ఈ జన్మలోనే రెండో జీవితాన్ని అనుభవించవచ్చన్నమాట... ఇదంతా నెట్ ప్రపంచంలో కొత్తగా వచ్చిన 'ఊహా లోకం' మహిమ...
ఆనందానికి 'హద్దు'లుండవ్
స్వేచ్ఛా జీవితానికి మరో చోటు
కులమూ ఉండదు.. మతమూ ఉండదు
ఇల్లు కట్టుకోవచ్చు...
వ్యాపారం చేసుకోవచ్చు...
డబ్బు సంపాదించవచ్చు
పలు బహుళజాతి సంస్థలు ఈ ఊహాలోకంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఐబీఎం ఇప్పటికే అందులో ఒక వ్యాపార కేంద్రాన్ని ప్రారంభించింది. భవిష్యత్తులో వ్యాపారానికి '3-డి ఊహా ప్రపంచం' కూడా ఒక వేదిక అవుతుందని ఐబీఎంలోని సీనియర్ అధికారులు విశ్వసిస్తున్నారు. 'రెండో జీవితం'లో 4వేల మంది ఐబీఎం ఉద్యోగులు నివాసితులుగా ఉన్నారు. ఈ రెండో జీవితంలో మీ అవతార్ పనిచేస్తుంది. డబ్బు సంపాదిస్తుంది. ఆ డబ్బును నిజమైన బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. ఇప్పటికే రోజుకు ఇందులో 15లక్షల అమెరికా డాలర్ల వ్యాపారం జరుగుతోంది. 2011కల్లా ఇంటర్నెట్ వినియోగదారుల్లో 80 శాతం మంది ఈ రెండో జీవితంలోకి ప్రవేశిస్తారని అమెరికాకు చెందిన గార్ట్‌నర్ అంచనా వేసింది. పలు భారతీయ కంపెనీలు కూడా దీనిపై దృష్టి సారిస్తున్నాయి. భారత్‌లో జులై నాటికి 1337 మంది మాత్రమే ఇందులో నివాసితులుగా చేరారు. ఇందులో నివాసితులుగా (రెసిడెంట్లు) చేరేవారి మధ్య భౌగోళిక సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఒక కంపెనీకి చెందిన వివిధ దేశాల్లోని కార్యాలయాల్లో పనిచేసేవారు ఒకేచోటకు చేరగలుగుతున్నారు.
'రెండో జీవితం' అంటే...
రెండో జీవితం అనేది 3-డి ఊహాలోకం. దీనిని నిర్మించేది, నిర్వహించేదీ అందులో నివాసితులుగా (సభ్యులుగా) చేరినవారే. 2003లో ప్రారంభమైన ఈ ఊహాలోకంలో ఇప్పుడు 87 లక్షలమంది విహరిస్తున్నారు. మీరు అందులోకి ప్రవేశించగానే అతిపెద్ద డిజిటల్ భూభాగం కనిపిస్తుంది. అందులో ప్రజలు ఉంటారు. వినోదం, విజ్ఞానం, అవకాశాలు అన్నీ అక్కడ లభిస్తాయి. ఒకచోట మీరు క్లిక్‌చేస్తే మీరు ఇల్లు కట్టుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి అవసరమైన స్థలం దొరుకుతుంది. మీ చుట్టూ అప్పటికే ఇళ్లు నిర్మించుకున్నవారూ దర్శనమిస్తారు. ఒక్కసారి ఇంటిని నిర్మించుకున్న తర్వాత దానిని సాధారణ ఇంటిలాగే అమ్ముకోవచ్చు... ఎందుకంటే దానిపై సర్వహక్కులూ మీకే ఉంటాయి.
ఈ ప్రపంచం ఎలా ఉంటుంది?
ఈ ఊహా ప్రపంచం రోజురోజుకూ పెరుగుతూ ఉంటుంది. రోజూ కొన్ని వేలమంది ఇందులో నివాసితులుగా చేరుతూ ఉంటారు. సాధారణంగా వేలమంది రోజూ వస్తుంటే నివశించడానికి భూమికి కొరత ఏర్పడుతుంది కదా? ఇక్కడ అలాంటి సమస్యలేదు. జనాభాకు అనుగుణంగా స్థల విస్తీర్ణం పెరుగుతుంది. ప్రజల ఆనందానికి ఇక్కడ కొన్ని వేల అవకాశాలు ఉంటాయి. కొంతమంది ఇక్కడ భూమిని కొంటూ ఉంటారు. అక్కడ వ్యాపారం ప్రారంభిస్తారు. 2003లో 64 ఎకరాల విస్తీర్ణంతో ప్రారంభమైన ఈ ప్రపంచం ఇప్పుడే 65వేల ఎకరాలకు విస్తరించింది.
మీ అవతార్‌ను ఎలా సృష్టించుకోవచ్చు?
రెండో జీవితం అనేది పూర్తిగా మీ వ్యక్తిగత ఇష్టానికి సంబంధించినది. మీకు 1జీబీ ర్యాం ఉన్న కంప్యూటరు ఉండాలి. బాగా వేగంగా ఉండే బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సౌకర్యముండాలి. ఆ తర్వాత మీరు మీ అవతార్‌ను సులభంగా సృష్టించుకోవచ్చు. ఊహాలోకంలో ఈ జన్మలోనే రెండో జీవితాన్ని మీ ఇష్టం వచ్చిన రీతిలో అనుభవించవచ్చు. ఇంకేం ప్రయత్నించండి. మీ రెండో జీవితాన్ని ఆనందమయం చేసుకోండి.
0 Comments:
Post a Comment
<< Home