"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Sunday, June 03, 2007

పరభాషానుబంధం.. అదే తేట తెలుగు మకరందం

ఆంధ్ర భాషా వైభవాన్ని చాటిన సదస్సు

చెన్నై, జూన్‌ 2 (న్యూస్‌టుడే): పొరుగనున్న తమిళనాటే కాదు పరిసరాల్లోని కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్రల్లో తెలుగు ప్రాభవాన్ని, ఆయా రాష్ట్రాల భాషలతో మన భాషకున్న సంబంధాలను విడమర్చి చెప్పింది తెలుగు సదస్సు. ఆయా రాష్ట్రాలలో తెలుగు భాషపై అధ్యయనం సాగించిన వారు ఒకే వేదికపై నుంచి నలుమూలలా విస్తరించిన తెలుగు వైభవాన్ని కళ్లకు కట్టారు. తెలుగు భాష గొప్పదనాన్ని వివరిస్తూ దాని ఉనికిని కాపాడేందుకు కృషిచేయాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ ఈ సదస్సు సాగింది. అయిదో అఖిల భారత తెలుగు మహాసభల్లో భాగంగా శనివారం ఇక్కడి కామరాజర్‌ అరంగంలో తెలుగు - ఇతర భారతీయ భాషలతో సంబంధాలు అనే అంశంపై చర్చజరిగింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహణ మండలి సభ్యులు సి.ధర్మారావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సును చెన్నై రాజధాని కళాశాల విశ్రాంతాచార్యులు దేవెళ్ల చిన్నికృష్ణయ్య ప్రారంభించారు. చిదంబరం అన్నామలై విశ్వవిద్యాలయం విశ్రాంతాచార్యులు పీఎస్‌ సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు.

తమిళ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన తెలుగు సాహిత్యం
తమిళ సాహిత్యాన్ని తెలుగు సాహిత్యం సుసంపన్నం చేసిందని మదురై కామరాజర్‌ విశ్వవిద్యాలయం తెలుగు తులనాత్మక అధ్యయన శాఖకు చెందిన ఆచార్య ఎస్‌.జయప్రకాష్‌ పేర్కొన్నారు. తెలుగు, తమిళ సంబంధాలు అనే అంశంపై ఆయన ప్రసంగిస్తూ తమిళ, తెలుగు భాషలు ఒకేసారి వచ్చినప్పటికీ తమిళం మాత్రమే ప్రాచీన భాష ఎలా అయిందో అర్ధం కావడం లేదన్నారు. తెలుగు వారి ప్రస్తావన తమిళ ప్రాచీన భాషలో కన్పిస్తుంది. ఆధునిక తమిళ నాటక రంగాన్ని కూడా తెలుగు భాష ప్రభావితం చేసింది. వైష్ణవ సాహిత్యాన్ని తెలుగువారే కాపాడారు. తమిళనాడులోని పలు ఆలయాల్లో తెలుగు శిల్పాలు ఉండటం ఇందుకు నిదర్శనమని తెలిపారు.

తెలుగుతో కన్నడ బంధం విడదీయలేనిది
తెలుగు భాషతో కన్నడ భాష సంబంధాలు విడదీయలేనివని బెంగుళూరు విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు చెందిన ఆచార్య జీఎస్‌ మోహన్‌ అన్నారు. తెలుగు కన్నడ సంబంధాల అంశంపై ఆయన ప్రసంగిస్తూ శాతవాహన కాలం నుంచి తెలుగు, కన్నడ భాషల మధ్య సంబంధాలున్నాయని గుర్తుచేశారు. లిపిలో కూడా రెండు భాషల మధ్య సాన్నిహిత్యం, అక్షరాలు ఒకటిగానే ఉండటం వల్ల కన్నడ భాషా ప్రభావం తెలుగుపై, తెలుగు భాషా ప్రభావం కన్నడంపై ఉందని పేర్కొన్నారు. ఈ రెండు భాషలు మాట్లాడే వారి మధ్య ఆచార వ్యవహారాల్లోనూ సంబంధం ఉందన్నారు.

తెలుగు ప్రభావం ఒరియాపై ఉంది
తెలుగు భాష ప్రభావం ఒరియా భాషపై ఉందని బరంపుర కళ్ళికోట కళాశాల రిటైర్ట్‌ రీడర్‌ చాగంటి తులసి తెలిపారు. తెలుగు-ఒరియా సంబంధాల అంశంపై ఆమె మాట్లాడుతూ ఒరియా భాషపై తెలుగు భాష ప్రభావం ఒకప్పుడు తక్కువగా ఉన్నప్పటికీ క్రమేణా ఈ ప్రభావం పెరిగేందుకు సంస్థానాల ప్రభువులు కీలక పాత్ర పోషించారు. రెండు భాషల మధ్య లిపిలో పోలిక ఉన్నప్పటికీ ఉచ్ఛారణలో తేడా కనిపిస్తుందని పేర్కొన్నారు.

మరాఠీతో సంబంధాలకు బాబ్లీ అడ్డుకాదు
బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం వల్ల మరాఠీతో తెలుగు భాషకున్న సంబంధాలు విడిపోవని హైదరాబాద్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు చెందిన ఆచార్య మసన చెన్నప్ప పేర్కొన్నారు. తెలుగు మరాఠీ సంబంధాల అంశం గురించి ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలో 1.30 కోట్ల మంది తెలుగువారున్నారు. మరాఠీతో తెలుగుకు సంబంధాలున్నాయి. మరాఠీ నాటకాల్లో తెలుగు సూత్రధారులు కన్పిస్తారని తెలిపారు.

చెన్నైలో తెలుగుకు విలక్షణ పదాలు
చెన్నై నగరంలో తెలుగు భాషలో విలక్షణ పదాలున్నాయని గూడూరులోని దువ్వురి రమణమ్మ మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.మెహర్మణి పేర్కొన్నారు. చెన్నపట్నం తెలుగు - తమిళభాషా ప్రభావం అంశంపై ఆమె మాట్లాడుతూ చెన్నైలో సినీ వ్యాపార, వైద్య రంగాల్లో తెలుగు వారు రాణిస్తున్నారు. మద్రాసులో అనేకమంది తెలుగువారు తమిళులుగానే స్థిరపడ్డారు. భాషతోపాటు ఆచారాలు, సంప్రదాయాల్లో కూడా ఒకే విధానం కనిపిస్తుందని తెలిపారు.

తెలుగు ప్రాచీన మూలాలను వెలికి తీయాలి
తెలుగు భాష ప్రాచీన మూలాలను వెలికి తీసేందుకు ప్రయత్నాలను ప్రారంభించాలని తెలుగు భాషోద్యమ తమిళనాడు శాఖ కార్యదర్శి స.వెం.రమేష్‌ పేర్కొన్నారు. తమిళనాడులోని తెలుగు మూలాలు-సంస్కృతి అనే అంశంపై ఆయన మాట్లాడుతూ తమిళనాట 42 శాతం మంది తెలుగువారుంటే వీరిలో 40 శాతం మంది ఇక్కడి వారే కాగా కేవలం రెండు శాతం మంది మాత్రమే ఉద్యోగ రీత్యా, వ్యాపారరీత్యా చెన్నైకి వలస వచ్చిన వారన్నారు. ఇక్కడున్న తెలుగువారిలో 90 శాతం మంది తెలుగులోనే మాట్లాడుతారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో తెలుగువారు ఇక్కడికి వలస వచ్చారనేది వాస్తవంకాదు. అప్పుడు వలస వచ్చిన వారు తక్కువే. తమిళ గడ్డపై గతంలో తెలుగువారు పరిపాలన సాగించారు. ద్రవిడ భాషల్లో ఏ భాషకు లేని జానపద సంపద మన తెలుగుకి ఉందని తెలుగు పుట్టుపూర్వోత్తరాలను ఆయన వివరించారు.

Courtesy: ఈనాడు
2007 Telugu conference Chennai Tamil Nadu Andhra Pradesh classical ancient language status Kannada Marathi Oriya Eenadu June

Labels:


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


0 Comments:

Post a Comment

<< Home